NTV Telugu Site icon

Pawan kalyan Varahi Yatra: నేటి నుంచే పవన్‌ కళ్యాణ్ వారాహి యాత్ర.. షెడ్యూల్ ఇదే!

Untitled Design (1)

Untitled Design (1)

Pawan kalyan’s Varahi Yatra starts from Today in Kathipudi: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేటి నుంచి ప్రారంభంకానుంది. అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న తర్వాత వారాహి విజయ యాత్రను పవన్ కొనసాగించనున్నారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఆవరణంలో వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. వారాహి వాహనం నుంచి పవన్ తొలి బహిరంగ సభ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో జరుగనుంది. వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగించనున్నారు.

కత్తిపూడి అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతుంది. తొలి 10 రోజుల్లో ఏడు బహిరంగ సభల్లో పవన్‌ ప్రసంగిస్తారు. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకొనేందుకు జనవాణి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అన్నవరం నుంచి నరసాపురం వరకు వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది.

వారాహి యాత్ర నేపథ్యంలో ఇప్పటికే అన్నవరం, కత్తిపూడి ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, నాయకుల సందడి మొదలైంది. జనసేన శ్రేణులు ఎంతో ఉత్సహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కటౌట్స్, జెండాలతో కత్తిపూడి ప్రాంతం మొత్తం కన్నుల పండగలా ఉంది. కత్తిపూడి మొత్తం పవన్ మేనియాతో ఊగిపోతోంది. కత్తిపూడి నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల మీదుగా వారాహి యాత్ర సాగనుంది.

మంగళగిరిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన యాగం మంగళవారం సాయంత్రం పూర్ణాహుతితో ముగిసింది. పూర్ణాహుతితో యాగం సంపూర్ణమైంది. యజ్ఞ జలంతో రుత్వికులు పవన్‌ కల్యాణ్‌కు పుణ్యస్నానం చేయించి, ఆశీర్వదించారు. యాగం అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి పవన్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఇక వారాహి యాత్రలో పవన్‌ కల్యాణ్‌తో పాటు పార్టీ నేతలకు వైద్య సేవల నిమిత్తం జనహిత అంబులెన్స్‌ కూడా సిద్దమైంది. లైఫ్ సపోర్ట్‌ వెహికిల్‌లో డాక్టర్‌, వైద్య సిబ్బంది ఈ యాత్రలో ఉంటారు.

వారాహి యాత్ర షెడ్యూలు (Varahi Yatra Schedule):
# 14 జూన్ 2023 – వారాహి నుంచి ప్రత్తిపాడు వారాహి యాత్ర, కత్తిపూడిలో సభ

# 16 జూన్ 2023 – పిఠాపురంలో వారాహి యాత్ర, సభ

# 18 జూన్ 2023 – కాకినాడలో వారాహి యాత్ర, సభ

# 20 జూన్ 2023 – ముమ్మిడివరంలో వారాహి యాత్ర, సభ

# 21 జూన్ 2023 – అమలాపురంలో వారాహి యాత్ర, సభ

# 22 జూన్ 2023 – పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర, మలికిపురంలో సభ

# 23 జూన్ 2023 – నరసాపురంలో వారాహి యాత్ర, సభ