NTV Telugu Site icon

Srihari Kota: ఈనెల 30న పీఎస్‌ఎల్వీ సీ53 ప్రయోగం

Pslv C53

Pslv C53

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మరో రాకెట్ ప్రయోగానికి వేదిక కానుంది. ఈనెల 30న అక్కడ పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో ఉపగ్రహ వాహక నౌక పీఎస్‌ఎల్వీ-సీ53 ద్వారా సింగపూర్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఐఎల్‌) కింద ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ప్రయోగ వేదిక వద్దకు రాకెట్‌ను చేర్చారు. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఈనెల 29న సాయంత్రం 5 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఈ కౌంట్ డౌన్ 25 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగనుంది.

ఈనెల 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ53 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. పీఎస్ఎల్వీ సీ-53 వాహక నౌక నింగిలోకి తీసుకెళ్లే మూడు ఉపగ్రహాలలో ఒకటి DS-EO. దీని బరువు 365 కిలోలు. ఈ ఉపగ్రహం 0.5 రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది ఒక ఎలక్ట్రో-ఆప్టిక్, మల్టీ-స్పెక్ట్రల్ పేలోడ్‌ ను కలిగి ఉంటుంది. మరో ఉపగ్రహం సింగపూర్ దేశానికి చెందిన న్యూసార్. దీని బరువు 155 కిలోలు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని స్టారెక్ ఇనిషియేటివ్ శాస్త్రవేత్తలు నిర్మించారు. మూడో ఉపగ్రహం SCOOB-I. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (NTU) రూపొందించింది. దీని బరువు 2.8 కిలోలు.

 

Read Also:

Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష