Student Haritha Case: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం సృష్టించిన విద్యార్థిని హరిత ఆత్మహత్య కేసులో పోలీసులు ఏడుగురు లోన్ రికవరీ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హరిత ఆత్మహత్యకు బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని నిర్ధారించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురు ఏజెంట్లు హరిత ఇంటికెళ్లినట్టు అందులో తేలింది. వాళ్లు ఎస్‌ఎల్‌వీ ఫైనాన్షియల్ సర్వీస్‌కు చెందిన ఏజెంట్లుగా గుర్తించారు. రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్లే హరిత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఎస్ఎల్‌వీ ఫైనాన్షియల్ సర్వీస్ ఏజెన్సీకి చెందిన ప్రతినిధులను శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు.. నందిగామ ఏసీపీ నాగేశ్వరరెడ్డి సమక్షంలో వత్సవాయి పీఎస్‌లో విచారణ నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల అదుపులో ముగ్గురు మేనేజర్లు , నలుగురు రికవరీ ఏజెంట్లు ఉన్నారు. మేనేజర్లు చలువ మున్నేధర్ రెడ్డి సింగిరెడ్డి వెంకటేశ్వరావు , బూరుగు మాధురిలు కాగా.. రికవరీ ఏజెంట్లు చిర్రా పవన్ కుమార్, కురుషోటి భాగ్యతేజ, చల్లా శ్రీనివాసరావు, గజ్జలకొండ వెంకట శివ నాగరాజుగా గుర్తించారు. ప్రధాన సూత్రదారులు చిర్రా పవన్ , కురుషోటి భాగ్యతేజ అలియాస్ సాయిగా గుర్తించారు. హరిత కుటుంబ సభ్యులను అవమానపరిచామని నిందితులు విచారణలో ఒప్పుకున్నారు.
విజయవాడ మొగల్రాజాపురంలోని ఓ బిల్డింగ్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఈ లోన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేట కేంద్రంగా రికవరీ ఏజెన్సీ కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బేగంపేట ఏజెన్సీ మేనేజర్ బూరుగు మాధురిని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
Andhra Pradesh BJP :: బీజేపీపై అమరావతి రైతులు కోపంగా ఉన్నారా..?
అసలేమైందంటే..: జాస్తి హరిత వర్షిణి అనే బాలిక ఈఏపీసెట్‌లో 15 వేల ర్యాంకు సాధించింది. బాలిక తండ్రి ప్రభాకర్‌రావు డిల్లీలోని ఒక ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. కుమార్తె చదువు కోసం తండ్రి ప్రభాకర్‌రావు… రెండేళ్ల క్రితం కరోనా సమయంలో విజయవాడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా క్రెడిట్ కార్డుపై మూడున్నర లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. ఇటీవల లోన్ రికవరీ ఏజెంట్లు ఇంటి వద్దకు అప్పు చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రిని అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతోనూ.. లోన్ రికవరీ ఏజెంట్లు చేసిన వ్యాఖ్యలతో హరిత వర్షిణి ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. మృతురాలి వద్ద లభించిన సూసైడ్ లేఖ ఆధారంగా, బాలిక తల్లి అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నందిగామ పోలీసులు లోన్ రికవరీ ఏజెంట్లను అరెస్ట్ చేశారు.
