ఇండిగో కీలక నిర్ణయం… కడప నుంచి విజయవాడ, చెన్నైకి విమానాలు

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. కడప నుంచి విజయవాడ, చెన్నైకు విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఈ మేరకు ఇండిగో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మార్గాల్లో విమానాలు నడిపిన ట్రూజెట్‌ సంస్థ తాము సర్వీసులు నడపలేమని ఒప్పందం రద్దు చేసుకోవడంతో ఇండిగోకు అధికారులు అవకాశం కల్పించారు.

Read Also: ఏపీలో కార్యాలయం.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే?

తాజా ఒప్పందం దృష్ట్యా వయబిలిటీ గ్యాప్ ఫండ్(వీజీఎఫ్) కింద ఏపీ ప్రభుత్వం ఇండిగో సంస్థకు రూ.20 కోట్లు చెల్లించనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మార్చి 27 నుంచి వారానికి నాలుగు విమానాలను ఇండిగో సంస్థ చెన్నై-కడప, విజయవాడ-కడప మార్గాల్లో నడపనుంది. అంతేకాకుండా కర్నూలు నుంచి విజయవాడకు మార్చి 27 నుంచి విమాన సర్వీసును నడుపుతామని గతంలోనే ఇండిగో సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.