MP Purandeswari: శాంతియుత అణుశక్తికి భారతదేశం అండగా నిలుస్తుందని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఐఏఈఏ నివేదికపై మన దేశ ప్రతినిధిగా రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదికపై భారత్ తరపున జాతీయ ప్రకటనను ఆమె వినిపించారు. అణు విజ్ఞానం, సాంకేతికతను శాంతియుతంగా, సురక్షితంగా, భద్రంగా వినియోగించుకోవడంలో IAEA పోషిస్తున్న కీలక పాత్రకు భారతదేశం తరపున మద్దతును ప్రకటించారు.
Read Also: Cyclone Montha : వరంగల్ ను ముంచేసిన మొంథా.. నగరమంతా నీళ్లలోనే
అయితే, అణుశక్తి వల్ల బహుముఖ ప్రయోజనాలున్నాయని ఎంపీ పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. స్థిరమైన అభివృద్ధి, ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాతావరణ చర్యలు లాంటి రంగాలలో అణు విజ్ఞానం, సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అణు విద్యుత్ పరిశోధనలలో భారతదేశం సాధించిన పురోగతి అసాధారణమైనదని అన్నారు. ముఖ్యంగా, భారతదేశంలోనే అభివృద్ధి చేసిన CAR-T సెల్ థెరపీ ద్వారా తక్కువ ధరకే క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సామర్థ్య పెంపుదల, సాంకేతిక సహకారం భాగస్వామ్య దేశాలతో అణు నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా భారత్ IAEAకు సహకరిస్తోందని పురంధేశ్వరి వెల్లడించారు.
