ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే రెండు వన్డేలు ముగియగా. సిరీస్ 1-1తో సమంగా ఉంది. రాంచిలో జరిగిన తొలి వన్డేలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. రాయ్‌పుర్‌లో జరిగిన రెండో వన్డేలో అద్భుత విజయం సాధించింది. బుధవారం సఫారీలు 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి.. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకున్నారు. ఇక నిర్ణయాత్మక మూడో వన్డే శనివారం (డిసెంబర్ 6) వైజాగ్‌లో జరుగుతుంది. వన్డే మ్యాచ్ నేపథ్యంలో విశాఖ నగరంలో ఇప్పటికే క్రికెట్ సందడి మొదలైంది.
శనివారం విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టికెట్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. టికెట్లు అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సిరీస్ డిసైడ్ మ్యాచ్ కావడంతో టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. టికెట్లు అన్నీ సోల్డ్ అయినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 అనంతరం చాలా గ్యాప్ అనంతరం మ్యాచ్ జరుగుతుండడంతో ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి ఇరు జట్ల ప్లేయర్స్ రాయపూర్ నుంచి విశాఖకు చేరుకోనున్నారు.
