NTV Telugu Site icon

Honey Trap: యువకుడికి యువతి గాలం… రెండున్నర లక్షలు హాంఫట్

Honey Trap

Honey Trap

ఈజీ మనీకోసం అర్రులు చాస్తోంది యువత. వివిధ మార్గాల్లో యువకులను ట్రాప్ చేసి వారి అకౌంట్లను కొల్లగొడుతున్నారు. ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి.. పరిచయంలేని వ్యక్తులు పంపే మెసేజ్ ల జోలికి వెళ్ళొద్దంటూ పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొందరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షలకి లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఏలూరు జిల్లా భీమడోలులో అధిక వడ్డీలు ఇస్తామని పోస్టల్ ఉద్యోగి ఏడులక్షలు పోగొట్టుకున్న ఉదంతం మర్చిపోకముందే అదే జిల్లాలో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు.

ఉపాధికోసం ఊరుగాని ఊరు వచ్చిన యువకుడిని హనీ ట్రాప్ తో బొల్తా కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. సూపర్ వైజర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి సంపాదించుకున్న సొమ్మును అతనికే తెలియకుండా ఊడ్చిపాడేసారు. ప్రీతి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వీడియోకాల్ చేయడానికి ఇరవై రూపాయలు రిఛార్జి చేయమంటూ వచ్చిన మెసెజ్ కు స్పందించిన క్షణాల్లోనే అతని అకౌంట్ నుంచి ఏకంగా రెండున్నర లక్షలు మాయం చేసేసారు సైబర్ నేరగాళ్లు.

బాపట్ల జిల్లా చీరాల నుంచి ఉపాధి నిమిత్తం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు వచ్చిన దేవాన గణేష్ అనే వ్యక్తి సైబర్ నేరగాళ్లకు చిక్కి రెండున్నర లక్షలు పొగొట్టుకున్నాడు. ఫేస్ బుక్ ద్వారా ప్రీతి అనే పేరుతో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఛాటింగ్ నడిచింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో టెలిగ్రామ్ వీడియోకాల్ మాట్లాడుకుందామంటూ ప్రీతి ఐడి నుంచి ఒక లింక్ షేరయ్యింది. అసలే అమ్మాయి…ఆమెతో వీడియో కాల్ అంటే మాములుగా ఉండదని భావించి వెనుకాముందు ఆలోచించకుండా వచ్చిన లింక్ డౌన్లోడ్ చేసాడు. వెంటనే వీడియోకాల్ కలిపి గణేష్ మాట్లాడటం మొదలు పెట్టిన కొద్దిసేపటికే నెట్ బ్యాలెన్స్ అయిపోతుందని వెంటనే 20రూపాయలతో రీఛార్జి చేయాలని ప్రీతి ఒక నెంబర్ ఇచ్చింది.

వెంటనే యువతి చెప్పిన నెంబర్ కు గణేష్ 20రూపాయలు రీఛార్జి చేశాడు. ఇరవై రూపాయలు కట్ అయినట్టుగా రావాల్సిన మెసేజ్ లో ఏకంగా రెండున్నరలక్షలు డెబిట్ అయినట్లు వచ్చింది. మెసేజ్ చూడగానే గణేష్ ఖంగు తిన్నాడు. సైబర్ నేరగాళ్లు పంపే మెసేజ్ జోలికి వెళితే ఏం జరుగుతుందో అర్ధమయ్యే సరికి కష్టపడి సంపాదించిన సొమ్ము కనిపించకుండా పోయింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో అర్ధం చేసుకున్న గణేష్ బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లోని బ్యాంకుకు రెండున్నరలక్షలు జమ అయినట్లు తేలింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన చేబ్రోలు పోలీసులు విచారణ చేపట్టారు. యూపీలోని బ్యాంక్ అకౌంట్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.

Crime News: యాక్సిడెంట్‌లో ముగ్గురు మృతి, 3 గంటలపాటు రాస్తారోకో