జిల్లా పేరు మార్పు కోనసీమ జిల్లాలో విధ్వంసం సృష్టించింది… తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.. ఈ ఘటనపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది.. తప్పు మీదంటే.. మీదేనంటూ దూషించుకుంటున్నారు నేతలు.. అయితే, ఈ ఘటనపై ఎన్టీవీతో మాట్లాడిన హోం మంత్రి తానేటి వనిత.. అసలు కోనసీమ విధ్వంసం ఊహించ లేదు, హఠాత్తుగా జరిగిందని పేర్కొన్నారు. అంబేద్కర్ పేరు పెట్టకపోతే జనసేన నాయకుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించిన ఆమె.. ధర్నాలు, నిరాహార దీక్షలు చేసింది ఎవరో అందరికీ తెలుసు.. కానీ, తర్వాత మాట మార్చారు అని మండిపడ్డారు.
Read Also: Pakistan: పాక్‌లో టెన్షన్, టెన్షన్.. మెట్రో స్టేషన్‌కు నిప్పు..
ఇక, తాము రాళ్ల దాడులు ఎదుర్కొన్నా ప్రజలెవరూ గాయపడకుండా పోలీసులు సంయమనం పాటించారని ప్రశంసించారు హోంమంత్రి తానేటి వనిత… పోలీసులను అభినందించాల్సింది పోయి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వారిని తప్పుబట్టడం, విమర్శించడం సరైంది కాదని హితవుపలికిన ఆమె.. అమలాపురంలో జరిగిన ఘటనల్లో ఇప్పటి వరకు 70 మంది వరకు అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. బాధ్యులెవరో విచారణ జరుగుతోంది.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు మంత్రి తానేటి వనిత. కాగా, కోనసీమ జిల్లాలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉన్నా, బస్సులు యథావిథిగా నడుస్తున్నా.. ఇంటర్నెట్ సేవలను మాత్రం నిలిపివేసిన విషయం తెలిసిందే.