ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర చేపట్టారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో రైతుల యాత్ర సాగిస్తున్నారు. ఈ యాత్ర ఇవాళ ఆరో రోజు కొనసాగుతోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న యాత్ర పెదనందిపాడులో ప్రారంభమై 14 కి.మీ మేర సాగి ఇవాళ పర్చూరులో ముగియనుంది.
ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా పర్చూరు వై జంక్షన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన స్థానికులకు తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. తమ వాహనాలను ఉదయం నుంచి పోలీసులు ఫోటోలు తీస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం పలికేందుకు వస్తున్న వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఈ యాత్రకు వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.