Hindupuram: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజా సేవల్లో ముందుంటారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. తాజాగా తన నియోజకవర్గం హిందూపురం ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. దీని కోసం ఎన్టీఆర్ ఆరోగ్య రథంను సిద్ధం చేశారు. ఈ వాహనం ద్వారా 200కి పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులను గ్రామాల్లోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రూ.40 లక్షలతో ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని తయారు చేయించారు. అ వాహనం శనివారం హిందూపురం చేరుకుంది. త్వరలోనే ఈ వాహనాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించనున్నారు.
Read Also: National Lok Adalat: ఏపీ వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్.. 94,263 కేసుల పరిష్కారం
కాగా ఎఆన్టీఆర్ ఆరోగ్య రథం వాహనంలో ఒక వైద్యుడు, ఒక నర్సు, ఫార్మాసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, ఆరుగురు వైద్య సిబ్బంది, మందుల కౌంటర్ ఉంటాయి. సాధారణ వ్యాధులకు వాహనంలోనే వైద్యం అందించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఇతర వైద్య సేవలు అవసరం అయితే వారిని పెద్ద ఆస్పత్రులకు సిఫారసు చేస్తారు. ఈ వాహనం హిందూపురం నియోజకవర్గంలో ప్రతిరోజు ఓ గ్రామానికి వెళ్లి ప్రజలకు సేవలు అందించనుంది. ఈ వాహనంపై అందరికీ ఆరోగ్యమస్తు.. ప్రతి ఇంటికి శుభమస్తు.. మన హిందూపురం.. మన బాలయ్య అని ఫోటోలు వేయించారు. అటు నారా లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఇటీవల ‘సంజీవని ఆరోగ్య రథం’ పేరుతో ఉచిత వైద్య సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
