అటు గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఇటు ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా ఒక లక్ష 15 వేల 783 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. జూరాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35 వేల 411 క్యూసెక్కులు మరోపక్క సుంకేసుల నుంచి లక్ష 52 వేల 585 క్యూసెక్కులు వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. మొత్తంగా శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా 3 లక్షల 3 వేల 779 క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుంది.
దీంతో గడిచిన 9 రోజులలో సుమారు 35 టీఎంసీల నీరు జలాశయానికి వచ్చింది. దీంతో జలాశయంలోని నీటి మట్టం ఒక్కసారిగా భారీగా పెరిగి 859.60 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి స్తాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 859.60 అడుగులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 104.6466 టీఎంసీలుగా నమోదైంది. మరోపక్క ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో తెలంగాణ జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఔట్ ఫ్లో గా 31,784 క్యూసెక్కుల నీరు దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. అయితే ఏపీ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించలేదు.
ఈ వరద ఉధృతి ఇలానే మరో వారం రోజులు పాటు కొనసాగితే జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుందని అధికారులు స్థానికులు భావిస్తున్నారు.ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలోకి స్థిరంగా వరద కొనసాగుతోంది. ఇదిలా వుంటే.. నాగార్జునసాగర్‌కు దిగువన బేసిన్‌లో వర్షాలు తగ్గాయి. దీంతో పులిచింతల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద కూడా 11,081 క్యూసెక్కులకు తగ్గిందని అధికారులు తెలిపారు. కృష్ణా డెల్టా కాలువలకు 3,700 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 7,381 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
తుంగభద్ర పోటెత్తడంతో మంత్రాలయంలో నీటిమట్టం పెరిగింది. మంత్రాలయం దగ్గర స్నానఘాట్ లు మునిగిపోయాయి. రైల్వే వంతెన, మాధవరం వంతెన ఉధృతంగా ప్రవహిస్తోంది. మంత్రాలయానికి వచ్చే భక్తులను స్నానఘట్టాలకు వెళ్ళనీవడం లేదు. బారికేడ్లతో వారిని నియంత్రిస్తున్నారు. నీటి ఉధృతి పెరుగుతున్నందున అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
Bandi Sanjay : కుట్రలకే పెద్ద కుట్రదారుడు కేసీఆర్