తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి.ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి తోడు దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వానలు పడే అవకాశముందని చెప్పింది. ఇక బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఉత్తర, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. రాయలసీమలో పలుచోట్ల జల్లులు కురుస్తాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి.
రానున్న 48 గంటల్లో హైదరాబాద్ , ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు తీరంలో మరో ఆవర్తనం ఉంది. ఫలితంగా నేడు, రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా మీదుగా తెలంగాణ వరకూ ఆవరించిన ఉపరితల ద్రోణి కారణంగా.. నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు.
