NTV Telugu Site icon

AP Rains: రాబోయే 2 రోజులు ఏపీలో వానలే వానలు..!

Rains

Rains

AP Rains: ఏపీలో గత ఆరు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్ధితి ఉంటుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. రాష్ట్రంలో వర్షాలకు కారణం వాయుగుండమేనని అని ఆయన వెల్లడించారు. అలాగే ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఎక్కువగా భారీ నుంచీ అతిభారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు కూర్మనాధ్. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలలో నుంచీ ఎవరూ వెళ్ళద్దని ఆయన సూచించారు‌.. ఇప్పటికే చంద్రబాబు వరద పరిస్ధితులపై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. మొత్తం జిల్లా యంత్రాంగాలకి సెలవులు రద్దు చేసి క్షేత్రస్ధాయిలో పని చేస్తున్నారని.. ఎనిమిది జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక సమీక్షను సీఎం చంద్రబాబు నిర్వహించారని చెప్పారు. ఏపీలో అనేక ప్రాంతాల్లో 5 సెం.మీ కంటే అధిక వర్షపాతం నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ రోణింకి కూర్మనాధ్ వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Read Also: Simhachalam: సింహాచలం గిరి ప్రదక్షిణను శాస్త్రోక్తంగా ప్రారంభించిన దేవస్థానం

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ మాట్లాడుతూ.. “గోదావరి నదికి వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న డ్యాంలను ఎప్పటికప్పుడు స్థిరీకరిస్తున్నాం.. ప్రకాశం బ్యారేజికీ ఎగువన ఎలాంటి ఇబ్బంది లేదు.. వరద ప్రభావం తక్కువే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చేపల వేటకు వెళ్ళే జాలర్లు వేటను విరమించుకోవాలి. తుఫాను తీరం దాటే వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.” అని ఆయన సూచించారు.

వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఒడిశాలోని చిలికా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం గత మూడు గంటలుగా అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని పూరీ తీరానికి నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్ పూర్‌కు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేపీ వాయవ్యంగా కదులుతూ, ఒడిశా-ఛత్తీస్ గఢ్ భూభాగాలపైకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది రాగల 12 గంటల్లో బలహీనపడి తిరిగి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.