2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే.. ఎన్డీయే కూటమి జోరు చూపిస్తోంది. ప్రస్తుతం వెలువడుతోన్న ఫలితాల ప్రకారం.. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ (122)ను దాటేసి 200లకు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీయే కూటమి విజయం ఖాయం కావడంతో పలువురు నేతలు స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. ఇది ప్రజలిచ్చిన అనుకూల తీర్పు అని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ సమర్ధవంతమైన పాలనకు ప్రజలిచ్చిన మద్దతన్నారు.
Also Read: OnePlus 15 Review: వన్‌ప్లస్ 15 రివ్యూ.. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ పర్ఫామెన్స్ ఎలా ఉన్నాయంటే?
‘అభివృద్ధికి ప్రజల పట్టం కట్టారు. బీహార్ ఊహించలేని రీతిలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంది. ప్రధాని మోడీ పాలనను సమర్ధిస్తూ బీహార్‌లో ఎన్డీయే కూటమికి ప్రజలు ఓటేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ కేవలం నినాదం కాదు. ప్రతి రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలనే విధంగా బీహార్ ప్రజలు ఓటేశారు. బీహార్ ఎన్నికలు కులాల సమీకరణ కాదు.. ఇది అభివృద్ధికి దక్కిన విజయం. అద్భుతమైన విజయం బీహార్‌లో దక్కింది. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం నితీష్ కుమార్ చేసిన ప్రచారం, అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారు. 2000 సంవత్సరంలో ఆర్జేడికి మెజార్టీ సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో పురుషులు ఆర్జేడికి అధికంగా ఓట్లు వేశారు. ప్రస్తుత ఎన్నికల్లో మహిళలు బీజేపీకి అధికంగా ఓటు వేశారు. పురుషుల్లో ఉండే కులభావనలు మహిళల్లో ఉండవు. బీహార్‌లో మహిళలు అభివృద్ధికి, మంచి పాలనకు ఓటు వేశారు. ఓట్ల చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేసిన యాగీ ప్రజల చెవుల్లో పడలేదు. ఓట్ల చోరీని ఎవరు పట్టించుకోలేదు. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ బాగా దిగజారిపోయింది’ అని జీవీఎల్ నరసింహారావు అన్నారు.
