Cash Bag Theft: పెళ్లికి వచ్చాడు.. అందరితో పాటు భోజనం చేశాడు.. అయితే, అతడి టార్గెట్ మాత్రం వేరు..పెళ్లిలో కలియతిరుగుతూనే అంతా గమనించసాగాడు.. చివరకు చదివింపుల సొమ్ము దాచిన బ్యాగ్‌తో ఉడాయించాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉడతా వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఉడతా వెంకట్రావు తనయుడు రమేష్ పెళ్లికి ఆహ్వానించిన వారంతా వచ్చారు. బంధువులు, స్నేహితులు రాకతో కల్యాణ మండపం సందడిగా మారింది. వచ్చిన బంధువులంతా వధువరూలను ఆశీర్వదించి విందు ఆరగించి వెళ్తున్నారు. అటు తర్వాత ఉడతా వెంకట్రావు తరుపున చదివింపులు రాసే వాళ్లు కూర్చుని ఉన్నారు. పెళ్లికి వచ్చిన వారిలో ఒకరి దృష్టి చదివింపులు రాస్తున్న వారిపైనే పడింది.
Read Also: Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్‌లో భారీ నిరసనలు.. హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు
వచ్చిన బంధువులంతా తమ శక్తి కొద్దీ చదివింపులు చదివించి వెళ్తున్నారు. అక్కడే కూర్చొని చదివింపులు రాస్తున్న వారు కూడా బిజీ బిజీగా ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి. వచ్చిన వారంతా వెళ్లిపోతున్నారు. దీంతో చదింపులు రాసిన వారు ఎంత మొత్తం వచ్చిందో లెక్క కట్టారు. దాదాపు మూడు లక్షల రూపాయల చదివింపులు వచ్చాయి. వాటన్నింటిని బ్యాగ్‌లో సర్థిపెట్టారు. అయితే పెళ్లికి పిలిస్తే వచ్చాడో లేక వృత్తి రీత్యా వచ్చాడో తెలియదు గాని, వచ్చినప్పటి నుండి వీరినే గమనిస్తున్న ఒక వ్యక్తి వెళ్తూ వెళ్తూ మూడు లక్షల రూపాయలకు పైగా ఉన్న క్యాష్ బ్యాగ్‌ను పట్టుకు వెళ్లిపోయాడు. అయితే బ్యాగ్ పోయిన విషయం కొద్దిసేపటి తర్వాత తెలుసుకున్న వెంకట్రావు కుటుంబ సభ్యులు ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: keerthy Suresh : సూర్య కి జోడిగా కీర్తి సురేష్..
రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ పరిశీలించారు. నేరచరిత్ర ఉన్న వ్యక్తే బ్యాగ్ తీసుకెళ్లినట్లు గుర్తించారు. బాపట్ల జిల్లాకు అతన్ని పట్టుకునేందుకు ఒక ప్రత్యేక బృందం వెళ్లింది. త్వరలోనే అతన్ని పట్టుకొని తీరతామని పోలీసులు అంటున్నారు. శుభకార్యాలు జరిగి కల్యాణ మండపాలకు వచ్చి అక్కడ అందినంత తీసుకుని ఉడాయించే ముఠా పనే ఇది అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో త్వరలోనే నిందితుడిని పట్టుకుని సొమ్ము తిరిగి ఇప్పిమని పోలీసులు హామీ ఇచ్చారని వెంకట్రావు కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడు దొరుకుతాడో లేదో తర్వాత సంగతి.. కానీ, శుభకార్యాలు జరిగే సమయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!
