బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనకు ముందు బీజేపీ-జనసేన మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బీజేపీ-జనసేన పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్దిగా పవన్ కళ్యాణ్ పేరును నడ్డా ప్రకటించాలని జనసేన డిమాండ్ చేసింది. అయితే.. జనసేన నేతల అల్టిమేటంపై ఘాటుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్టిమేటంలకు బీజేపీ భయపడదని, పొత్తులు.. సీఎం అభ్యర్థిపై నడ్డా పర్యటనలో ఎలాంటి ప్రస్తావన ఉండదని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీలో చాలా మంది సీఎం అభ్యర్థిగా నిలబడగల నేతలున్నారని, మంత్రులుగా.. కేంద్ర మంత్రులుగా పని చేసిన అనుభవజ్ఞులు, సమర్థులు బీజేపీలో ఉన్నారని ఆయన వెల్లడించారు. బీజేపీలోని ప్రతి కార్యకర్త సమర్దుడేనని, ప్రతి రోజూ రాజకీయం చేయడం బీజేపీ వ్యతిరేకమన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే బీజేపీ రాజకీయాలు చేస్తుంది.. మిగిలిన సమయంలో ప్రజల పక్షాన నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చేయాల్సిన పోరాటాలపై నడ్డా దిశా నిర్దేశం చేస్తారని ఆయన తెలిపారు.
