Dangerous Devil Fish: అత్యంత ప్రమాదకరమైన డెవిల్ ఫిష్ (దెయ్యపు చేప) గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరులోని చేపల చెరువులో ప్రత్యక్షమైంది. నదులు, సముద్రాలకే పరిమితం కావాల్సిన ఈ చేపలను చూసి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దావులూరుకు చెందిన కోట రాంబాబు వ్యవసాయం చేస్తూనే, ఎకరంన్నర విస్తీర్ణం గల చెరువులో చేపల పెంపకం చేస్తున్నారు. గత ఆగస్టులో మార్కెట్ డిమాండ్ కలిగిన బొచ్చె, రాగండి, గడ్డి చేపల సీడ్ ను రెండు వేల కౌంటు చెరువులో వేశారు. రోజూ మేత వేస్తున్నారు. ఫీడింగ్ ఎలా ఉంది? చేపలు ఎదుగుతున్నాయా? వ్యాధులు ఏమైనా వచ్చాయా? అనేది తెలుసుకునేందుకు చెరువులో వల వేయించి చేపలు పట్టించాడు. వాస్తవంగా తాము చెరువులో వేసిన చేపలు ఒకటీ, రెండూ మాత్రమే వస్తూ, డెవిల్ చేపలు ఎక్కువ పడుతుండడాన్ని గమనించారు. వలకు బొచ్చె, రాగండి చేపలు తక్కువగా రావటమే కాదు.. వచ్చిన ఒకటీ ఆరా చేప కూడా అర కిలో బరువు తూగాల్సి ఉంటే, కేవలం పావు కిలోకు మించలేదని చెప్పారు. అంటే డెవిల్ చేపలు రోజూ వేస్తున్న మేతను, చేపలను కూడా తినేస్తున్నాయన్న నిర్ధారణకు వచ్చి ఆందోళనలో పడ్డాడు. కృష్ణానదికి మూడు నెలల క్రితం వచ్చిన భారీ వరదలతో డెవిల్ ఫిష్ ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.
Read Also: IndiGo: రన్‌వేపై ట్రాక్టర్.. 40 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం
వాస్తవానికి డెవిల్ ఫిష్ 2016 లో తొలిసారిగా కృష్ణానదిలో విజయవాడ వద్ద కనిపించింది. భూమి మీద కూడా నడిచి వెళ్లే సామర్థ్యం ఉన్న ఈ డెవిల్ ఫిష్, ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 65 శాతం నీటి వనరులకు విస్తరించిందని అంచనా వేస్తున్నారు. స్థానిక చేపల జాతులను విపరీతంగా తినేస్తూ.. సున్నిత మైన జల జీవావరణ వ్యవస్థనూ దెబ్బతిస్తుంది. విభిన్నమైన ఆహారాలను తీసుకునే ఈ చేపలు అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేరు. ఆక్సిజను లేని పరిస్థితిని కూడా తట్టుకుంటాయి. కొన్ని సందర్భాల్లో వలలకు నష్టం చేయడంతో పాటు మత్స్యకారులకు గాయాలను కూడా చేసిన ఘటనలున్నాయి. 152 విభిన్న మంచినీటి చేప జాతులకు నిలయమైన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో డెవిల్ ఫిష్ ను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందని, లేకుంటే చేపల చెరువులు, పంట కాలువలు, నదుల్లో చేపల ఉత్పత్తికి ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.