Gudivada Amarnath Reddy Counter To Chandrababu Naidu: ప్రకృతి వైపరీత్యాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. నటనలో తన మామ ఎన్టీఆర్‌నే చంద్రబాబు మించిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నటన, నాట్యం చూస్తూ.. జయప్రద కూడా సిగ్గు పడేలా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లక్ష కుటుంబాలకు వరద సహాయం అందించామని.. కానీ చంద్రబాబు వరద ప్రాంతాలకు వెళ్లి అబద్ధాలు చెప్తున్నారన్నారు.
వరద నష్టం అంచనా అయ్యాక ఇచ్చే నష్ట పరిహారాన్ని.. తక్షణ సహాయం కింద తాను గతంలో ఇచ్చినట్టు చంద్రబాబు చెప్పిన మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని అమర్నాథ్ అన్నారు. హుదూద్‌ని కూడా ఆయన తన ప్రచారానికి వాడుకున్నారే తప్ప, బాధితుల్ని ఆదుకుందేమీ లేదని ఆరోపించారు. చంద్రబాబు హామీలు పేపర్లలో తప్ప.. చేతల్లో చూపించడం ఎప్పుడూ జరగలేదన్నారు. ఇక ఇదే సమయంలో.. విలీన మండలాలతో ప్రత్యేక జిల్లాను చేసే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని గుడివాడ అమర్నాథ్ అన్నారు.
కాగా.. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు, వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఏపీని పాలిస్తోందని, వరదల కారణంగా భారీ నష్టాలొస్తే, వైసీపీ ప్రభుత్వం కేవలం రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని మండిపడ్డారు. ప్రజల కోసం కష్టమైనా పలకరించాలన్న బాధ్యతతో తాను ప్రజల్లోకి వచ్చానని, కానీ సీఎం మాత్రం ప్యాలెస్‌లో దర్జాగా కూర్చున్నారంటూ ఆగ్రహించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే గుడివాడ అమర్నాథ్ పై విధంగా స్పందించారు.
