NTV Telugu Site icon

పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగులు ఒకటే టీం

పీఆర్సీ విషయంలో విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం, ఉద్యోగులూ ఒకే టీం. సమస్యలు ఇరు పక్షాలకూ తెలుసు. కాబట్టి దీనిలో విజయం, వైఫల్యం అంటూ ఏమీ లేదన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆందోళనలు ప్రజాస్వామ్యంలో ఒక ఎక్స్‌ప్రెషన్‌ గానే ప్రభుత్వం చూసింది. రాష్ట్ర సొంత ఆదాయం రెండున్నర ఏళ్ళ కిందట ఉన్న దగ్గరే ఆగిపోయిందన్నారు సజ్జల.

80 వేల కోట్లకు పైగా ఆదాయం ఉంటే ఉద్యోగులు అడగాల్సిన అవసరమే లేదు అని సీఎం స్వయంగా చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు చర్చల్లో పాల్గొన్నారు. మినిట్స్ చదివే వరకు ఉండి అప్పుడు బయటకు వెళ్ళి వేరే రకంగా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్?ప్రభుత్వానికి అమ్ముడుపోయారని విమర్శిస్తున్నారు. కొనే వాళ్ళు ఎవరు? కొనే అవసరం ఎవరికి ఉంది? చేయగలిగేంత వరకు చేసిన తర్వాత ఇలా మాట్లాడటం తప్పు అన్నారు సజ్జల.

వామపక్షాలు, ఒక వర్గం మీడియా ఏదో జరిగిపోతుందనే విధంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నాయి. కేరళలో హెచ్ఆర్ఏ శ్లాబులు 4 శాతం నుంచి ఉన్నాయి. అక్కడ కు వెళ్ళి ఎందుకు వామపక్ష పార్టీలు అడగవు?సమ్మె వరకు వెళ్ళనందుకు టీడీపీ, ఇతర పక్షాలకు డిసప్పాయింట్ అయ్యాయి. అంగన్వాడీ వర్కర్లకు జీతాలను , ఆశా వర్కర్ల జీతాలు మూడు వేలు ఉంటే ఈ ప్రభుత్వం ఏకంగా 10వేలు చేసింది. ఆర్టీసీలో 50 వేల మంది ఉద్యోగులపై ఈ రెండేళ్లలో మూడు వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఆదర్శప్రాయమైన అంశం. వాస్తవంగా ఎంత మేరకు సాధ్యం అవుతుందో ఆలోచించాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.