Site icon NTV Telugu

సుప్రీంకోర్టు ఆదేశాలను జగన్ సర్కారు ధిక్కరిస్తోంది: టీడీపీ ఎమ్మెల్యే

ఏపీలో జగన్ సర్కారుపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో టీడీపీ సోషల్ మీడియా విభాగం సమన్వయకర్త సంతోష్‌ను అరెస్ట్ చేసేందుకు సీఐడీ పోలీసులు ప్రయత్నించారని.. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ఎమ్మెల్యే గోరంట్ల ప్రశ్నించారు. సోషల్ మీడియా పోస్టుల అంశంలో కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం సంతోష్ భార్య నిండు గర్భవతి అని, ఆమె ఆసుపత్రిలో ఉందని వెల్లడించారు. ఇలాంటి సమయంలో సంతోష్ ను అరెస్ట్ చేయాలని చూడడం కక్షపూరిత వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

Read Also: ఆలయాల నిర్మాణానికి రూ.44.98 కోట్లు

ఓవైపు సోషల్ మీడియా పోస్టుల విషయంలో కేసులేవీ ఉండవని సుప్రీంకోర్టు చెబుతుంటే.. జగన్ సర్కారు మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి కొత్త రాజ్యాంగ విధానాలు అమలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శలు చేశారు. టీడీపీ సానుభూతిపరుడు అనే కారణంగా సంతోష్‌పై కక్ష తీర్చుకునేందుకు అరెస్ట్ చేయాలని చూడటం దారుణమన్నారు. కాగా సీఐడీ అధికారులు సంతోష్‌ను అరెస్ట్ చేయకుండా ఆస్పత్రి వద్ద గోరంట్ల కుర్చీ వేసుకుని బైఠాయించి నిరసన తెలిపారు.

Exit mobile version