ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు వాలంటీర్ల ఖాతాల్లో ప్రతినెలా ప్రత్యేకంగా డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న న్యూస్ పేపర్ కొనుక్కునేందుకు ప్రతి నెల రూ.200 చొప్పున ఇవ్వనుంది. దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమకాలీన అంశాల గురించి గ్రామ, వార్డు వాలంటీర్లు తెలుసుకోవచ్చని జగన్ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అంతేకాకుండా న్యూస్ పేపర్ ద్వారా సమకాలీన అంశాల గురించి తెలుసుకుని దుష్ప్రచారాలను తిప్పికొట్టి ప్రజల ఆందోళనలను తొలగించవచ్చని జగన్ సర్కారు పేర్కొంది. 2022 జులై నుంచి 2023 మార్చి వరకు ఈ సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.66 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారు. వీళ్లందరికీ ప్రతి నెలా రూ.200 నగదును న్యూస్ పేపర్ల కోసం ప్రభుత్వం వెచ్చించనుంది.
Read Also: BJP Exhibition: ఆసక్తి రేపుతున్న ఫోటో.. కృష్ణుడు ఆయనే.. అర్జునుడు ఆయనే
కాగా ప్రతి ఏడాది ఉగాది పండుగ సందర్భంగా వాలంటీర్లను ప్రభుత్వం సన్మానిస్తోంది. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ఉగాది రోజున ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోంది. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏడాదికిపైగా సేవలందించినవారికి అవార్డుకు ఎంపిక చేసి రూ.10 వేలు నగదు, ప్రసంశా పత్రం, శాలువా, బ్యాడ్జితో సత్కరిస్తోంది. మొత్తం మూడు కేటగిరీల్లో వాలంటీర్లకు ప్రభుత్వం అవార్డులు, రివార్డులు అందజేస్తోంది. ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం వంటి కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా సేవా రత్న అవార్డులను ప్రదానం చేస్తోంది.