NTV Telugu Site icon

అంగన్‌వాడీ కేంద్రాలకు అమూల్‌ పాలు

అంగన్‌వాడీ కేంద్రాలకు అమూల్‌ పాలను అందించేందుకు ఏపీ డెయిరీ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం32,59,042 మందికి ప్రభుత్వం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాల ద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తుంది. వీరిలో 3,24,378 మంది గర్భిణులు, 2,23,085 మంది బాలింతలు, 15,64, 445 మంది మూడేళ్లలోపు చిన్నారులు, 11,47,134 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. తల్లీ బిడ్డలకు ప్రతినెలా పాల ప్యాకెట్లను ప్రస్తుతం కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ ద్వారా ఏపీకి సరఫరా చేస్తున్నారు. తొలుత 181 మిల్క్‌ స్టాక్‌ పాయింట్లకు తరలించి అక్కడి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలనకు సరఫరా చేస్తున్నారు.

పాల సరఫరాలో ఇబ్బందులను అధిగమించేందుకు ఇటీవల ఏపీ డెయిరీ కార్పొరేషన్‌ మిల్క్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా ఇబ్బందులు తలెత్తుతునే ఉన్నాయి.ఈ ఇబ్బందులను అధిగమించేందుకు అమూల్‌ పాలను సరఫరా చేస్తే ఇబ్బందులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రాష్ర్ట మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు.