రోశయ్య మరణం రాష్ర్టానికి, రాష్ర్ట రాజకీయాలకు తీరని లోటని మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు అన్నారు. రోశయ్యకు నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రోశయ్య గౌరవ ప్రదమైన వ్యక్తి అని ఆయన అన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా, మంత్రిగా ఏపీకి ఎన్నో సేవలు అందించారన్నారు. చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి ఆర్థిక వ్యవస్థకే వన్నె తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. రోశయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు.
రోశయ్య తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డ: వెంకటేష్, మాజీ మంత్రి
రోశయ్య మరణం తీరని బాధను కలిగిస్తుందని, ఆయన తెలుగు రాష్ర్టాల ముద్దుబిడ్డ అని టీజీ వెంకటేష్ అన్నారు. ఆయన మన రాష్ట్రానికి పెద్ద దిక్కు అన్నారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చివరి రోజుల్లో ఆయన సలహాలు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆర్థిక మంత్రిగా దేశంలోనే రికార్డులు సృష్టించారని తెలిపారు. మా రాజకీయ భవిష్యత్‌కు ఆయన పెద్ద దిక్కుగా ఉండేవారని వెంకటేష్ అన్నారు. ఆర్యవైశ్యలనే వ్యవస్థ ద్వారా సేవ కార్యక్రమాలను దేశానికి చూపించారన్నారు. సమస్య వచ్చినప్పుడు ఆర్యవైశ్యులను నా దగ్గరకు పంపించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. రోశయ్యకు జీవితాంతం రుణపడి ఉంటానని టీజీ వెంకటేష్ అన్నారు.
