NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో ఈనెల 29న రోడ్డుపై ల్యాండ్ కానున్న విమానాలు.. కారణం ఏంటంటే..?

Flights

Flights

Andhra Pradesh: ఏపీలో చాలా ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. గన్నవరం, రేణిగుంట, విశాఖ లాంటి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులతో పాటు పలు డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులు కూడా ఉన్నాయి. అయితే ఈనెల 29న ఏపీలో జాతీయరహదారిపై విమానాలు ల్యాండ్ కానున్నాయి. విజయవాడ-ఒంగోలు మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిపై విమానాలు ల్యాండ్ అవుతాయి. అయితే ఇది మాక్ డ్రిల్ మాత్రమే. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ విమానాల ల్యాండింగ్‌కు అనుకూలంగా ఉండేలా నేషనల్ హైవేలో కొంత మేర మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం రేణింగవరం, కొరిశపాడు గ్రామాల మధ్య నుంచి వెళ్తున్న 16వ నెంబరు జాతీయ రహదారిపై అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు 4 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్డు వెడల్పుగా నిర్మించారు.

Read Also: Yanamala: అప్పులపై బహిరంగ చర్చకు సీఎం జగన్ సిద్ధమా?

ఈ మేరకు డిసెంబరు 29న ఉదయం 11 గంటలకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఒక కార్గో విమానం, రెండు జెట్‌ ఫైటర్‌లు దిగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తామని.. వాహనదారులు గమనించాలని కోరారు. కాగా యుద్ధ విమానాలను అత్యవసర పరిస్థితుల్లో క్షేమంగా నేలపైకి దించడానికి కొన్ని జాతీయ రహదాలను ఎంపిక చేసి వాటిలో కొంత దూరం మేర మార్పులు చేస్తున్నట్లు గతంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ మేరకు ఏపీలోని నెల్లూరు-ఒంగోలు, ఒంగోలు – చిలకలూరిపేట మార్గాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.