NTV Telugu Site icon

ఆ మత్స్యకారుడి పంట పండింది.. వేలంలో చేపకు భారీ ధర

అంతర్వేదిలో మత్స్యకారులకు అప్పుడప్పుడూ పంట పండుతుంటుంది. సాగరమాత వారికి ఇలా వరాలు ఇస్తూ వుంటుంది. వారి వలలో పడే చేపలు వారికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుంటాయి. వారి కుటుంబానికి ఆధరువు అవుతాయి. తూర్పుగోదావరి సఖినేటిపల్లి మండలం అంతర్వేది సాగర సంగమం వద్ద వశిష్ట గోదావరి నదిలో స్థానిక మత్స్యకారుల వలలో 28 కిలోల మగ కచ్చిడి చేప చిక్కింది. ఇంత భారీ చేప దొరకడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి అని మత్స్యకారుడు ఆనందం వ్యక్తం చేశాడు.

మత్స్యకారుడి వలకు చిక్కిన చేప ఇదే

ఈ కచ్చిడి చేపను స్థానిక ఫిషింగ్ హార్బర్ లో వేలం వేశారు. ఆ చేపకు రికార్డు స్థాయిలో ధర పలికింది. 28 కిలోల చేపకు రూ.2.60 లక్షల ధర వచ్చింది. స్థానికంగా వుండే ఓ వ్యాపారి ఈ చేపను కొనుగోలు చేశారు. అరుదుగా చిక్కే ఈ చేపలను కలకత్తాకు ఎగుమతి చేస్తామని వ్యాపారి తెలిపారు. ఒక్క చేపతో తమ దశ తిరిగిందని మత్స్యకారుడు సంతోషంగా చెప్పాడు.