Nellore District: ఈ లోకంలో కన్నబిడ్డలపై ప్రేమ లేని తల్లిదండ్రులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. కానీ కొందరు తమ ప్రేమను బయటకు చాటుకుంటారు.. కొందరు అయితే తమ ప్రేమను మనసులోనే దాచిపెట్టుకుంటారు. అయితే ఓ తండ్రి మాత్రం తన ప్రేమను ఎవరికీ సాధ్యం కాని రీతిలో చాటుకున్నాడు. నెల్లూరు జిల్లాలోని కాకుటూరు గ్రామంలో ఓ తండ్రి తన కుమార్తె జ్ఞాపకంగా ఆలయం కట్టించాడు. నిత్యం అందులో పూజలు చేస్తూ కనిపిస్తున్నాడు. కాకుటూరు గ్రామానికి చెందిన చెంచయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఐదుగురు సంతానం ఉన్నారు. నాలుగో కుమార్తె సుబ్బలక్ష్మమ్మ డిగ్రీ పూర్తి చేసింది. చదువు అయ్యాక ఫారెస్ట్ డిపార్టుమెంట్‌లో ఉద్యోగంలో చేరింది. దీంతో తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు. కానీ ఈ సంతోషం కొన్నాళ్లకే విషాదంగా మారింది.
Read Also: Superstar Krishna: ప్రతి ఏడాది కృష్ణ స్మారక అవార్డు ప్రదానం
2011లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుబ్బలక్ష్మమ్మ ప్రాణాలు కోల్పోయింది. బిడ్డ అంటే ఎంతో ఇష్టం ఉన్న చెంచయ్య తన కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో గ్రామంలో ఆమె జ్ఞాపకార్థం గుడి కట్టించాడు. ఆలయం కట్టించడంతో వాళ్ల ఇంటికి చాలా మంది వస్తుంటారు. చెంచయ్య ఇల్లు ఓ పుణ్యక్షేత్రంగా కనిపిస్తూ ఉంటుంది. గ్రామంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాసులు కూడా చెంచయ్య కుమార్తె ఆలయాన్ని సందర్శిస్తారు. ఆమె వర్ధంతి సందర్భంగా ప్రార్థనలు కూడా చేస్తారు. కుమార్తె జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించాలనే తన ఆలోచనకు కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చారని తండ్రి చెబుతున్నారు. ఆమె వర్ధంతి సందర్భంగా ఆమెకు పూజలు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తుండటం గమనించాల్సిన విషయం.
