గుంటూరు జిల్లాలో నకిలీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. రోజుకో ప్రాంతంలో నకిలీ నోట్లు బయటపడుతుండడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఒరిజినల్ నోట్లకు నకిలీ నోట్లకు తేడా తెలియకపోవడంతో జనం మోసపోతున్నారు. కొందరు కేటుగాళ్ళు ఈజీ మనీకోసం నకిలీ కరెన్సీ చలామణి చెయ్యడం మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని నకిలీ కరెన్సీ చలామణి చేస్తూ జనాన్ని నిలువునా మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. భారీ మొత్తంలో నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి మార్కెట్లోకి చలామణిలోకి తెస్తున్నారు. వినుకొండ నియోజకవర్గంలో రెండుసార్లు నకిలీ నోట్లు బయపడ్డాయి. ఈపూరు మండలం ఎర్రబాలెంలో పొలానికి వెళ్తున్న రైతుకు రోడ్డుపై కరెన్సీ దొరికింది.
అయితే నోట్లను పరిశీలించిన రైతుకు అనుమానం వచ్చింది. దీంతో నగదును పోలీసులకు అప్పగించారు. నోట్లను పరిశీలించిన పోలీసులు నకిలీవిగా తేల్చారు. 87నకిలీ వందరూపాయల నోట్లుగా గుర్తించారు. నకిలీ కరెన్సీని చలామణి చేసేందుకు వచ్చి పోలీసుల భయంతో రోడ్డుపై పడేసి వెళ్లినట్లు అనుమానం. తాజాగా వినుకొండలో పెట్రోల్ కోసం బంక్ కు యువకుడు వచ్చాడు. ఐదువందల నోటు ఇచ్చిన యువకుడికి బాయ్ 200రూపాయల నోటు తిరిగి ఇచ్చాడు. ఈ నోటును చూసిన యువకుడికి అనుమానం వచ్చింది. తీరా పరిశీలిస్తే రెండు వందల రూపాయల నోటు నకిలీదిగా తేలింది. దీంతో యువకుడు ఖంగు తిన్నాడు.
పల్నాడు ప్రాంతంలో కూడా ఇదే తరహాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఘటనలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. మాచర్లలో ఓ షాపులో నకిలీ నోట్లతో కొనుగోలు చేసేందుకు వచ్చిన సమయంలో యజమాని గుర్తించాడు. వెంటనే నకిలీ నోట్లుగా చెప్పడంతో తనకు ఎవరో ఇచ్చారని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఇక దాచేపల్లి, రాజుపాలెం, పేరేచెర్ల ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఘటనలు బయటకొచ్చాయి. ప్రధానంగా వంద, రెండు వందలు, ఐదువందల రూపాయల నోట్లు ప్రింటింగ్ చేసి చలామణి చేస్తున్నారు. కొద్దిగా కంప్యూటర్ పై అవగాహన ఉంటే చాలు ప్రింటర్ సాయంతో నోట్లు ప్రింటింగ్ చేసి ఈజీగా మార్కెట్లో చలామణి చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గతంలో తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ, మిర్యాలగూడ, హైదరాబాద్ ప్రాంతాల్లో నకిలీనోట్లు చలామణి చేస్తూ పట్టుబడ్డ వారిలో గుంటూరు జిల్లాకు చెందినవారు కూడా ఉన్నారు. ఒరిజినల్ నోట్లు పదివేలు ఇస్తే నకిలీ నోట్లు ముప్పైవేలు ఇస్తామంటూ అమాయకులను టార్గెట్ చేసి ఈ ఊబిలోకి దించుతున్నారు. పెద్దమొత్తంలో నకిలీ నోట్లు చలామణి చేస్తే ఇబ్బందులు కలుగుతాయని చిన్న మొత్తాల్లోనే చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు బయటకొచ్చినా అవి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లకపోవడంతో నకిలీల దందా కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్న కేటుగాళ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఫేక్ దందాకు అడ్డుకట్ట వెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.