విశాఖ జిల్లా పాయకరావుపేటలో కులధ్రువీకరణ పత్రాల స్కాం వెలుగుచూసింది. పాయకరావుపేట నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా బీసీ-డి కులానికి చెందిన కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. ధృవీకరణ పత్రాలలో తప్పులు రావడంతో తహసీల్దార్ అంబేద్కర్‌ను బాధితులు ఆశ్రయించారు. అధికారుల పరిశీలనలో ఇవి నకిలీవిగా స్పష్టం కావడంతో అసలు విషయం బహిర్గతం అయ్యింది. విశాఖ కేంద్రంగా 27 మీ సేవా కేంద్రాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. అయితే తనకు సంబంధం లేకుండా నకిలీ ధ్రువపత్రాలను మంజూరు చేసినట్లు తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలో పాయకరావుపేటలో 91 మందికి బీసీ-డి సర్టిఫికెట్లు జారీ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్, విశాఖలోని ఇద్దరు మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు. ప్రభుత్వం నుంచి అందే రిజర్వేషన్లు పొందేందుకు తూర్పు కాపు సర్టిఫికెట్ల కోసం కొంతమంది అగ్ర కులస్తులు దరఖాస్తు చేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఈ మేరకు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.
