NTV Telugu Site icon

AP 10th Class Results: 11 మార్కులకే పాస్.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ

Ap Fact Check On 10th Results

Ap Fact Check On 10th Results

నిన్న పదో తరగతి ఫలితాల్ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే! పాస్ శాతం పక్కనపెడితే.. మార్కుల జాబితాలో కొన్ని అవకతవకలు కనిపించాయి. చాలామంది పిల్లలకు పాస్ మార్కులు రాకపోయినా, పాస్ చేసేశారు. వేరే వాళ్ళకు అంతకుమించి మార్కులు వచ్చినా (పాస్ అర్హత కంటే తక్కువే), ఫెయిల్‌గా ప్రకటించారు. దీంతో.. ‘‘ఏంటీ తప్పుల తడక’’ అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరీ ఇంత నిర్లక్ష్య ధోరణి ఏంటి? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా అలా ఎలా ఫలితాలు వెల్లడిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిసింది.

ఈ నేపథ్యంలోనే ‘ఆ అవకతవకల’పై ఫ్యాక్ట్ చెక్ ఏపీ స్పష్టత ఇచ్చింది. ఆయా విద్యార్థుల మెడికల్ కండీషన్స్‌ను బట్టి.. తక్కువ మార్కులు వచ్చినా పాస్ చేయడం జరిగిందని వెల్లడించింది. నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విమర్శలకు ఎగబడటం.. పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితిపై హేళన చేసినట్లే అవుతుందంటూ ఘాటుగా స్పందించింది. తప్పుడు సమాచారల్ని నెట్టింట్లో పోస్ట్ చేయడానికి ముందు, అసలు నిజాలు తెలుసుకోవాలని ఫ్యాక్ట్ చెక్ సూచించింది. ఇదీ.. అసలు సంగతి! ఆరోగ్య పరిస్థితి బాగోలేని విద్యార్థులను మార్కులతో సంబంధం లేకుండా పాస్ చేయడం జరిగింది.

ఇదిలావుండగా.. ఏపీ విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో 67.26 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులు అయ్యారు. 71 స్కూళ్లలో చదువుతున్న 2 లక్షల మంది ఫెయిల్ అయినట్టు మంత్రి బొత్స తెలిపారు. ఎప్పట్లాగే ఈసారి కూడా బాలికలదే పైచేయి. ఉత్తీర్ణ శాతం బాలికల్లో 70.70 శాతం, బాలురలో 64.02 శాతంగా ఉంది. ఫలితాల్లో 78.3 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 49.7 శాతం ఉత్తీర్ణతతో అనంతపురం ఆఖరిస్థానంలో నిలిచింది.

Show comments