Andhra Pradesh: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా ఏపీలోని నెల్లూరులో తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో 25 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులోని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన ఓ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ గదిలో భారీగా రికార్డులను గుర్తించిన అధికారులు.. ఆ గది తాళాన్ని పగులకొట్టి రికార్డులను పరిశీలించారు.
Read Also: Minister KTR: టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదు
కాగా ఢిల్లీలోని వైన్ షాపుల్లో కొన్ని షాపులను మాగుంటకు చెందిన లిక్కర్ కంపెనీలు చేజిక్కించుకున్నాయని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలోని మాగుంట నివాసాల్లో సీబీఐ సోదాలను నిర్వహించింది. స్వతహాగా మద్యం వ్యాపారి అయిన మాగుంట కుటుంబం దశాబ్దాలుగా మద్యం షాపులను నిర్వహిస్తోంది. ఉమ్మడి ఏపీలోనూ మాగుంట కుటుంబానికి మద్యం వ్యాపారాలు ఉన్నాయి. అటు నెల్లూరు జిల్లా రేబాలలోని ఎంపీ మాగుంట బంధువు ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ మేరకు ఎంపీ మాగుంట బంధువులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
