Chintamaneni Prabhakar: ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాబోయే 20 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలోని ఉద్యోగస్తులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా పిండి వంటలు పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులను కోల్పోయి పండుగకు దూరంగా ఉన్నవారిని కుటుంబ సభ్యులుగా భావించి వారికి కూడా పిండి వంటలు అందించినట్లు తెలిపారు.
Read Also: Poco M8 5G: ఇండియాలో స్టార్ట్ అయిన Poco M8 5G సేల్.. ధరలు, ఆఫర్లు ఇవే!
ఇక, కొత్త సంవత్సరం సందర్భంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ఎవరికి సంబంధించిన బొమ్మలు లేకుండా పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని వెల్లడించారు చింతమనేని.. అలాగే ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చామని, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా గతంతో పోలిస్తే ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ పథకంలో కొంతమంది అధికారులు చేసిన తప్పిదాల వల్ల కొందరు ఇబ్బంది పడ్డారని, వారికి కూడా త్వరలో లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు.
అమరావతి నుంచి పోలవరం వరకు అభివృద్ధి జరుగుతోందని, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని అన్నారు చింతమనేని.. అయితే, కొంతమంది కావాలనే కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, సమాజంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ బూటకమని, దెందులూరు నియోజకవర్గంలో ఆ పార్టీకి స్థానం లేదని వ్యాఖ్యానించారు.. కొన్ని పార్టీలకు దెందులూరులో నాయకులే లేరని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తుందని, నియోజకవర్గంలో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా, వారు ఏ పార్టీకి చెందినవారైనా తాను సహాయం చేస్తానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
