ఏపీలో వంటనూనెల ధరలు సామాన్యులను ఠారెత్తిస్తున్నాయి. వ్యాపారులు ఉక్రెయిన్ యుద్ధం వంక పెట్టి ధరలు పెంచేస్తున్నారు. వంట నూనెల ధరల నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీర్ శర్మ సమీక్ష చేపట్టారు. వంట నూనెల ధరల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశాలిచ్చారు. వంట నూనెల ధరల పెరుగుదల నియంత్రణకు కలెక్టర్లు, జేసీలు, పౌరసరఫరాలు, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తదితర విభాగాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా స్థాయిలో హోల్ సేల్ డీలర్లుతో సమావేశం నిర్వహించాలి. వంట నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉండి నిర్దేశిత ధరలకు విక్రయించేలా చూడాలి. రైతు బజారులో సరిపడిన మొత్తం వంటనూనెల స్టాకు అందుబాటులో ఉండేలా చూడాలి. వంటనూనెల తయారీదారులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వ్యాపారుల తీరుపై అధికారులు మండిపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ధరలు పెంచి విక్రయిస్తున్న దుకాణదారులపై కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. రావులపాలెంలో మూడు షాపులపై కేసులు నమోదు చేశారు.