Illegal Smuggling: తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి ప్రాంతంలో అక్రమ కలప స్మగ్లింగ్‌ను అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ అడ్డుకుంది. దేవరపల్లి, కన్నాపురం ప్రాంతాల నుంచి సుమారు వంద సంవత్సరాల వయస్సు గల అరుదైన రావి చెట్లను వేళ్లతో సహా నరికి, వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయాలు జరుపుతున్న ముఠాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో కొనుగోలు చేసిన వందల ఏళ్ల వయసున్న ఈ రావి చెట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. స్మగ్లర్లు ఈ చెట్లను కేవలం రూ. 80కు కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో ఏకంగా రూ. 10 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. భారీ లాభాల కోసమే ఇటీవల కాలంలో కలప మాఫియా మరింతగా పెట్రేగిపోతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Kerala: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్కూల్ టీచర్‌కు ‘‘జీవిత ఖైదు’’
అయితే, తెలుగు ప్రజలు ఇప్పటి వరకు ‘పుష్ప’ తరహాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి వింటూ వచ్చారు. కానీ, ఇప్పుడు అక్రమ స్మగ్లర్ల కన్ను అత్యంత పవిత్రంగా భావించే, వందల ఏళ్ల చరిత్ర గల రావి చెట్లపై పడటంతో ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్లు పర్యావరణపరంగా, ఆధ్యాత్మికంగా ఎంతో విలువైనవి అన్నారు. కాగా, ఈ దాడుల్లో అటవీ శాఖ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది రెండు లారీలు, వాటిలో తరలిస్తున్న ఐదు భారీ రావి వృక్షాలను దేవరపల్లిలో జాతీయ రహదారి పక్కన స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ చెట్లను ఎక్కడికి తరలించడానికి ప్రయత్నిస్తున్నారు, ఈ స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు.
