Rs.5 Biryani Offer: రాజమండ్రి నగరంలోని దానవాయిపేటలో ఒక బడా బిర్యాని రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుత ఎమ్మెల్యే తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులను సైతం వ్యాపారులు ఆహ్వానించారు. అయితే.. ఎమ్మెల్యే వచ్చిన సమయంలో నలుగురైదుగురు పోలీసులు రావడం, మళ్ళీ వారి కూడా వెళ్లిపోవడం సహజం. కానీ.. ఈ బిర్యానీ షాపు ప్రారంభం సందర్భంగా ఈ రోజు రూ.5 కే బిర్యాని అందిస్తున్నట్లు ఆఫర్ ప్రకటించారు. దీంతో భారీగా జనం బిర్యాని కోసం ఎగబడ్డారు. ఇంతవరకు బానే ఉన్నా.. వీళ్ళు సాగిస్తున్న ఐదు రూపాయల బిర్యానీ వ్యాపారం కోసం పోలీసులు పహారాకాయడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. పోలీసులు దగ్గరుండి.. ఆ రహదారి అంతా పూర్తిగా బ్లాక్ చేసి, ట్రాఫిక్ ని మళ్లించడం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. పోలీసులే రెండు వైపులా రహదారిని బ్లాక్ చేసి మరీ.. ఆ వ్యాపార లావాదేవీలకు ఇబ్బంది రాకుండా చూడడం విమర్శలకు దారితీసింది. పలువురు ఇదేమి దారుణమంటూ మండిపడ్డారు.
Read Also: Mallu Beauties: మలయాళ భామల ప్రేమలో పడ్డ టాలీవుడ్
కార్లు అక్కడవవరకూ వచ్చి వెనక్కి తిప్పడానికి, పక్కరోడ్డులోకి వెళ్ళడానికి నానా తంటాలూ పడ్డారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ షాపు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో బిర్యానీ అమ్మకాల కోసం కర్రలతో బారీకేట్లు ఏర్పాటు చేసి క్యూలైన్ల ద్వారా బిర్యానీ విక్రయించారు. అయితే… వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ 10 మందివరకూ ఉన్నప్పటికీ.. ఈ వ్యాపారం పూర్తయ్యే వరకు, ఒక ఎస్సై తో పాటు దాదాపు 15 మంది వరకు పోలీసు సిబ్బంది ఈ ప్రాంగణంలోనే డ్యూటీ నిర్వహించారు. బిర్యానీ కౌంటర్ వద్ద కూడా పోలీసు సిబ్బంది ఉండటం చూసి అందరూ అవాక్కయ్యారు. వాళ్ళ వ్యాపారం పూర్తయ్యే వరకూ షాపు ప్రాంగణంలోనే పహార కాయడం చూసిన ప్రజలంతా ముక్కున వేసుకున్నారు. ప్రమాదాల పాలై ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా కూడా.. ఒకరిద్దరు పోలీసులు మించి వచ్చే పరిస్థితి ఉండదు. వేర్వేరు చోట్ల విధుల్లో ఉంటారు. కానీ.. ఒక ప్రైవేటు వ్యాపారి తన లాభాపేక్ష కోసం షాప్ పెట్టుకుంటే.. ఆ షాపు వద్ద వాళ్ల వ్యాపారాలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు కల్పించడం మాత్రం దారుణమని ప్రజలు పెదవిరుస్తున్నారు. సాక్షాత్తు పురపాలక శాఖ మంత్రి నగరంలో ఉండగానే.. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి వ్యవహారాలు.. పోలీస్ యంత్రాంగానికే మచ్చ తెచ్చేవిగా ఉంటాయని పలువురు పెదవి విరుస్తున్నారు.
Read Also: Supreme Court: మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్‌లకు ఊరట.. ఏపీ, తెలంగాణకు సుప్రీంకోర్టు నోటీసులు
వాస్తవంగా రూ ఐదు రూపాయలకే బిర్యానీ అని ఈ ఒక్కరోజు పెట్టిన ఆఫర్ వల్ల.. అక్కడ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుంది. దీనిపై షాపు వాళ్లని పోలీస్ అధికారులు ముందుగా హెచ్చరించాల్సి ఉంది. షాపువద్ద ఇబ్బన్ఫి లేకుండా, ట్రాఫిక్ నిలిచిపోకుండా షాపు నిర్వాహకులే చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ.. ఇక్కడ మాత్రం వాళ్లు పెట్టుకున్న ప్రైవేటు బందోబస్తు తో పాటు, దాదాపు 15 మంది వరకు పోలీసు సిబ్బంది కూడా బిర్యానీ వ్యాపారం పూర్తయ్యే వరకు వాళ్లకి బందోబస్తు నిర్వహించడం దారుణమని పలువురు మండిపడుతున్నారు. అక్కడ బిర్యానీ పొట్లాల వద్ద కూడా హంగామా చేయడం చూస్తుంటే.. పోలీసులు కూడా ఐదు రూపాయల బిర్యానీ.. పొట్లాల కోసం కక్కుర్తి పడ్డారా.. అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరోపక్క ఈ వ్యవహారంలో పోలీసులకు భారీగా సదరు వ్యాపారి ముట్టజెప్పాడమే ఒక కారణం అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీసుల పాత్ర కీలకమైనది. కానీ, వీళ్ళ డ్యూటీని పక్కనపెట్టి, బిర్యానీ వ్యాపారాలకు కాపలాగా ఉండటం చూస్తుంటే. పోలీసు వ్యవస్థ చివరికి ఇలా తయారయిందా అన్న ఆవేదన కూడా చాలామంది నుండి వ్యక్తమవుతోంది.