MLC Elections 2025: ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 30 గంటల పాటు సాగిన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకోవడంతో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను విజేతగా ప్రకటించారు అధికారులు.. దీంతో, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయినట్టు అయ్యింది.. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగింది. కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తొలి రౌండ్ నుంచి కూటమి తరపున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఆదిత్యంలో కొనసాగారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తం పోలైన ఓట్లు 2,18,997 కాగా ఇందులో వ్యాలీడ్ ఓట్లు 1,99,208గా ఉండగా.. 19,789 చెల్లని ఓట్లుగా ఉండటంతో విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 99,605 ఓట్లుగా మారింది.
Read Also: KTR: ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తుక్కుగా అమ్మెందుకు కుట్ర
అయితే, మొత్తం 8 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి 1,24,702 తొలి ప్రాధాన్యత ఓట్లుగా వచ్చాయి.. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులకు 47,241 ఓట్లు దక్కాయి. ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం..77,461 ఉండడంతోపాటు .. విజయానికి అవసరమైన 99,605 మొదటి ప్రాధాన్యత ఓట్లు దాటడంతో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను విజేతగా ప్రకటించారు అధికారులు.. పోటీలో మొత్తం 35 మంది అభ్యర్థులు నిలిచినప్పటికీ ఇతరులు ఎవరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కూటమి ప్రభుత్వానికి అందించిన విజయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లోను గ్రాడ్యుయేట్లు కొనసాగించారని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు కచ్చితంగా నెరవేరుస్తామని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువగా రావడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు కూటమికి ఎంత మద్దతు పలుకుతున్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.