Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి గ్రామంలో నిర్వహించనున్న అమరజీవి జలధారా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.20 గంటలకు మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరనున్న పవన్, ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి గ్రామ హెలిప్యాడ్‌కు బయలుదేరి, ఉదయం 10.50 గంటలకు అక్కడికి చేరుకుంటారు. ఉదయం 10.55 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో అమరజీవి జలధారా కార్యక్రమం జరుగనున్న వేదికకు చేరుకుని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమంలో పాల్గొంటారు.
Read Also: India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..
కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు వేదిక నుంచి బయలుదేరి, 1.05 గంటలకు పెరవలి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి, మధ్యాహ్నం 1.50 గంటలకు అక్కడికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తదుపరి ప్రయాణానికి సిద్ధమవుతారు. ఈ పర్యటన నేపథ్యంలో పెరవలి గ్రామం పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
కాగా, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని దీక్షబూని ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు గారి పేరును ప్రతి ఒక్కరూ నిత్యం తలచుకొనేలా చేస్తోంది కూటమి ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు ఉద్దేశించిన జె.జె.ఎం.వాటర్ గ్రిడ్ పథకానికి ‘అమరజీవి జలధార’ అని నామకరణం చేశారు. ప్రతి మనిషి జీవితంలో ఉరుకుల పరుగులన్నీ అన్నపానీయాల గురించే ఉంటాయి. నేను… నా కుటుంబం… వారికి మూడు పూటలా పట్టెడన్నం, స్వచ్ఛమైన నీరు అందించాలనే తపన ప్రతి మనిషికి ఉంటుంది. ఉండాలి. కానీ… నేను, నా కుటుంబం అనే దగ్గరే ఆగిపోకుండా… సమాజం, నా ప్రజలు, నా రాష్ట్రం, నా భాష అని గళమెత్తి, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు పేరును ప్రతి ఒక్కరూ తలచుకొనేలా చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
అన్నపానీయాలు మాని, 56 రోజుల పాటు మండుతున్న కడుపు, ఎండిపోయిన డొక్కకు బంకమట్టి రాసుకుని పోరాడిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహా మనిషి త్యాగానికి నివాళిగా అమరజీవి జలధార అని ఖరారు చేశారు. ఇక, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన పనులకు శనివారం ఉదయం నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామంలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ‘అమరజీవి జలధార’ పోస్టర్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.
ప్రాజెక్ట్ వివరాలు
* రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఐదు ప్రాజెక్టులు చేపడుతున్నారు
* ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, పల్నాడు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి
* మొత్తం ప్రాజెక్టు విలువ : రూ. 7,910 కోట్లు
* వచ్చే 30 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహర్తి తీర్చడం లక్ష్యం
* ఇప్పటికే ప్రకాశం జిల్లాకు సంబంధించిన పనులకు మార్కాపురంలో శంకుస్థాపన చేశారు
నేడు శంకుస్థాపన చేయబోయే పనుల వివరాలు :
* పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో రెండు ప్రాజెక్టులు
* 23 నియోజకవర్గాల పరిధిలో 68 లక్షల మంది దాహర్తి తీర్చనుంది
* రెండు ప్రాజెక్టుల మొత్తం విలువ రూ. 3,050 కోట్లు
* ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా : రూ. 1400 కోట్లు
* ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా : రూ.1,650 కోట్లు