ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కొంతమంది దేవాలయాలకు చందాలు, విరాళాలు ఇస్తుంటారు. ఒక వ్యక్తి ఇచ్చిన విరాళం తక్కువే అయినా, కోట్లలో విరాళం ఇచ్చినట్టు దేవస్థానం రికార్డుల్లో నమోదైంది. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి శ్రీవారి నిత్య అన్నదానం ట్రస్టుకు. రూ. 2116 చెల్లించాడో భక్తుడు. కానీ రూ 8.కోట్లకు పైగా ఇచ్చినట్టు ఆన్ లైన్లో ఎంటర్ చేశాడో ఉద్యోగి. ఆ తప్పు సరిదిద్దుకునేందుకు ఆలయ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి నిత్య అన్నదాన ట్రస్టుకు కు ఒక భక్తుడు రూ.2,116 విరాళం చెల్లించాడు. అతడు రూ.8 కోట్లకు పైగా చెల్లించినట్లు ఉద్యోగి ఆన్లైన్లో పొరపాటున నమోదు చేశాడు. చివరకు నగదు లావాదేవీలలో కోట్లాది రూపాయల మేర తేడా రావడంతో సంబంధిత ఉద్యోగి ఆలయ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికిచెందిన ఓ భక్తుడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ తూర్పు రాజగోపురం ప్రాంతంలోని డొనేషన్ కౌంటర్ లో గురువారం సాయంత్రం నిత్య అన్నదానం ట్రస్టుకు రూ.2,116 విరాళంగా చెల్లించాడు. అక్కడే ఉన్న దేవస్థానం ఉద్యోగి నగదు ఎంటర్ చేయాల్సిన స్థానంలో పొరపాటున భక్తుడి నెంబర్ ఎంటర్ చేశాడు. దాంతో ఆ భక్తుడు రూ. 8 కోట్లకు పైగా విరాళం చెల్లించినట్లు ఆన్లైన్లో నమోదైంది.
ఆ తరువాత ఉద్యోగి ఆ నగదు రసీదును భక్తుడికి అందించగా అతడు స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం డీసీఆర్ క్లోజ్ చేసే సమయంలో కోట్ల లో నగదు తేడా వచ్చినట్లు గుర్తించారు. క్షుణ్ణంగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఖంగుతిన్న ఆలయ అధికారులు ప్రస్తుతం ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లలో తేడా రావడంతో ఉద్యోగి చేసిన పొరపాటు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.