Site icon NTV Telugu

Dwakra Group Women: డ్వాక్రా గ్రూప్‌ డబ్బులు నొక్కేసిన మహిళ..! స్తంభానికి కట్టేసి ఏం చేశారంటే..?

Dwakra Group

Dwakra Group

Dwakra Group Women: డ్వాక్రా సంఘం గ్రూపులో లోన్‌ తీసుకున్న మహిళలు.. నెలవారీగా వాయిదాలు చెల్లిస్తూ వస్తుంటారు.. అయితే, ఆ లోన్ సొమ్ములు బ్యాంక్ లో జమచేయకుండా ఓ మహిళ తానే వాడుకుంది.. ఈ విషయం కాస్తా గ్రూపులోని మహిళలకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.. చివరకు ఆమెను పట్టుకుని స్తంభానికి కట్టేశారు.. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విరాల్లోకి వెళ్తే..

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో దారుణం చోటు చేసుకుంది. డ్వాక్రా గ్రూపు మహిళలకు సంబంధించిన సొమ్మును గ్రూపులోని నిద్ర పావని అనే మహిళ బ్యాంకుకి కట్టకుండా సొంత అవసరాలకు వాడుకుంది. గ్రూపులోని పదిమంది సభ్యులకు సంబంధించి సుమారు మూడు లక్షల రూపాయల వరకు పావని బ్యాంకుకు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతోంది. ఈరోజు గ్రామానికి పావని రావడంతో డ్వాక్రా మహిళలందరూ ఆమెను నిలదీశారు. తమ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ పట్టు పట్టడంతో పావని అందుకు సమాధానం చెప్పలేదు. దీంతో ఆగ్రహించిన గ్రూపు మహిళలు పావనిని స్తంభానికి కట్టేసి తమ డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పావని భర్త ఆమెను విడిపించేందుకు ప్రయత్నించాడు. దీంతో, బాధిత మహిళలు అతనితో వాగ్వాదానికి దిగారు. చివరికి ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గ్రూప్ సభ్యుల డబ్బులు తీసుకుని సమాధానం చెప్పకుండా తిరుగుతున్న పావని తనపై తోటిసభ్యులు దాడి చేశారంటూ ఆస్పత్రిలో చేరింది.

Exit mobile version