NTV Telugu Site icon

AU Drugs Culture: ఏయూలో డ్రగ్స్ కల్చర్.. ఈ విశాఖకు ఏమైంది?

Vizag Drugs

Vizag Drugs

సాగరతీరంలో అదో ప్రశాంతమైన అందమైన క్యాంపస్.. జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా ఎన్నో కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్న యూనివర్సీటి..ఉన్నత విద్యలు అందించే చదువులు తల్లి.. దేశ విదేశాలకు ఎంతో మంది ప్రతిభా వంతులను అందించిన చదువుల దేవాలయం. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో మత్తు పదార్ధాలు.. విద్యార్ధుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది..వందేళ్ల చరిత్ర కలిగిన ఆ యూనివర్సీటిను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని పేరు ప్రతిష్టలకు తీవ్ర భంగం కలిగిస్తున్నారు…యూనివర్సిటీ ప్రాంగణంలో, పరిసర ప్రాంతాల్లో మత్తును పరిచయం చేస్తూ విద్యార్ధుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నారు…

ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తాజాగా వెలుగుచూసిన ఘటనలో పట్టుబడిన ముగ్గురు నిందితుల్లో యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ఉండడం అటు విద్యార్ధుల్లోను, ఇటు విద్యార్ధుల తల్లిదండ్రుల్లోను ఆందోళనకు కారణమవుతోంది. బీచ్‌రోడ్డులోని యోగా విలేజ్‌, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల పరిసర ప్రాంతాల్లో వీరు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కడం వర్సిటీలో చర్చకు దారితీసింది. వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకునే చోట గంజాయి ఆనవాళ్లు బయటపడడం విస్మయానికి గురిచేస్తోంది. గత కొంతకాలంగా విశాఖ నగరంలో మత్తు పదార్థాల విక్రయం జోరుగా సాగుతోంది. గతంతో పోలిస్తే గంజాయి రవాణా విపరీతంగా పెరిగింది. జిల్లా సరిహద్దులను దాటిస్తున్న వారిలో యువతే అధికంగా పట్టుబడుతున్నారు. చాలా చోట్ల గంజాయి తాగుతున్న వ్యక్తులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఇటీవల పలుమార్లు పోలీసులు భారీ ఎత్తున మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన సెక్యూరిటీ గార్డులు గంజాయితో పట్టుబడడం కలకలం రేపుతోంది. ఏయూలో మత్తుపదార్థాల విక్రయాలు సాగుతున్నాయనే విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.

గతంలో ఒకసారి వర్సిటీలో లా విద్యార్థులు, బయట కళాశాల లా విద్యార్థులు గంజాయి వ్యవహారంలోనే పెద్దఎత్తున గొడవలు పడి పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లాయి. ఆ తరువాత ఇలాంటి ఘటనలు వెలుగులోకి రానప్పటికీ వర్సిటీలో గుట్టుగా గంజాయి సరఫరా జరిగిపోతోందనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా పోలీసులకు చిక్కిన వారిలో ఏయూ సెక్యూరిటీ గార్డులు ఉండడం, వీరిలో ఒకరు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వాహనానికి డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి కావడం ఆందోళనకు గురి చేస్తోంది. బీచ్‌రోడ్డులోని యోగా విలేజ్‌తోపాటు ఏయూ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఏయూలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న చంద్రమౌళితోపాటు ఆటోడ్రైవర్‌ సురేష్‌, సతీష్‌ ఏయూ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌, త్రీటౌన్‌ పోలీసులు సంయుక్తంగా మూడు రోజుల కిందట మాటువేసి ఏయూ యోగా విలేజ్‌ వద్ద చంద్రమౌళి, పెదవాల్తేరులోని విశాఖ కంటి ఆస్పత్రి వద్ద సురేష్‌ బైక్‌ మీద గంజాయి విక్రయించేందుకు వేచి వుండగా పట్టుకున్నారు. వారిద్దరూ ఇచ్చిన సమాచారంతో అదే ప్రాంతంలో సతీష్‌ అనే ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురి నుంచి కొంతమొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదుచేసి రిమాండ్‌ కోసం మేజిస్ర్టేట్‌ ఎదుట హాజరుపరచగా, వారికి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. అరెస్టు చేసిన ముగ్గురు ఇచ్చిన సమాచారం మేరకు సంతోష్‌తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు.

Read Also: PVN Madhav: బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్

పోలమాంబ గుడి నుంచి వర్సిటీ వరకు గతంలో అనేక దుకాణాలు ఉండేవి. వీటిలో గుట్టుగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయన్న సమాచారంతో అధికారులు వాటిని తొలగించారు. కానీ సెక్యూరిటీ సిబ్బందే గుట్టుగా గంజాయి విక్రయిస్తుండడం, వర్సిటీ కేంద్రంగా ఇలాంటి వ్యవహారం సాగుతోందనే విషయం వెలుగులోకి రావడంతో అధికారుల్లో అలజడి మెదలైంది. గంజాయి వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోకుండా వర్సిటీ ఉన్నతాధికారులు లోతుగా దృష్టి సారించి, గంజాయి విక్రయాల వెనుక సెక్యూరిటీ గార్డుతోపాటు ఎవరెవరున్నారో తేల్చాలని, విద్యార్థుల జీవితాలకు భరోసా కల్పించేలా విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉన్నత చరిత్ర కలిగిన ఆ యూనివర్సీటిను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని పేరు ప్రతిష్టలకు తీవ్ర భంగం కలిగిస్తున్నారు…గతంలో కొన్ని నెలలు కిందట సంచలనం సృష్టించిన చీకటి కోణం వెలుగుచూసింది… చీకటి పడితే చాలు పక్క లు సర్ధి వ్యభిచారానికి పరుపులు పరచడం, పొదలు మాటున, చెట్లపైన చండాలమైన పనులకు పాల్పడం వెలుగుచూసింది.. ఇదంతా ఏ శివారుల్లోనో, చాటు మాటునో కాదు..రద్దీగా ఉండే రోడ్డు ప్రక్కనే…అప్పుడు బయటపడిన ఈ సంఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన హాట్ టాఫిక్ గా మారింది…

రాత్రయితే చాలు క్యాంపస్ అని కూడా చూడకుండా రాసలీలలు..విచ్చలవిడిగా మద్యం, గుట్టుచప్పుడు కాకుండా గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్ధాలు.. అవి చాలవన్నట్లు దారుణ హత్యలు…ఇదీ విశాఖలోని ఆంధ్రా యూనివర్సీటి ప్రాంగణంలో, పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న తంతు…ఆంధ్రా యూనివర్సిటీలో కొన్ని నెలల కిందట మరో చీకటి కోణం బయటపడడం విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రుల్లోను, విశాఖ నగర వాసుల్లోను ఆందోళనకు గురిచేస్తుంది. విద్యార్ధులను టార్గెట్ గా చేసుకుని మత్తుపదార్ధాలు సరఫరా చేయడం.. బాయ్స్ హాస్టల్ వెనుకాలే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం.. అక్కడ బయటపడ్డ డెన్ చూసిన వారెవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

భారత దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న క్యాంపస్ లలో ఆంధ్రా యూనివర్శిటీ ఒకటి.. ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడ చదవిన ఎందరో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఇక మన దేశంలో ఎందరో ప్రముఖులు చదివినప క్యాంపస్ గా గుర్తింపు పొందింది. ప్రతి ఏడాది వందల సంఖ్యలో మంచి మంచి పదవులతో క్యాంపస్ నుంచి బయట పడుతుంటారు. కేవలం విద్య విషయంలోనే కాదు.. చూసేందుకు కూడా ఏయూ చాలా అందంగా ఉంటుంది. ఎటు చూసిన పచ్చని చెట్లు.. విశాలమైన క్రీడా మైదానాలు.. ఆడిటోరియంలు.. పురాతన కట్టడాలు.. విశాలమైన రోడ్లతో.. అందో అందమైన ప్రదేశంగా.. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వివిధ దేశాల నుంచి.. రాష్ట్రాల నుంచి కూడా భారీగా విద్యార్థులు వస్తూ ఉంటారు. అలాంటి క్యాంపస్ లో సమాజం సిగ్గు పడే పనులు వెలుగులోకి వచ్చాయి. బయటకు కనిపించని స్థావరాల్లో రహస్యంగా మినీ డెన్ ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. వందలాది బాక్సుల్లో వేలాది కండోమ్ లు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి..

అందమైన క్యాంపస్ ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందా? ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ బాయ్స్ హాస్టల్‌ వెనుక ఉన్న పొదల్లో, ఏకంగా ఓ మినీ డెన్‌నే ఏర్పాటు చేసి వ్యభిచారం, మందు పార్టీలు, మత్తు సిరంజిలు సేవిస్తున్న ఘటనలు ఆ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది. వర్సిటీ సుందరీకరణ పనుల కోసం హాస్టల్ వెనుక పొదల్ని తొలగిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతం శుభ్రం చేయాలని ప్రయత్నించే క్రమంలో వ్యభిచార బాగోతం బయటపడింది. వెదురు చెట్లు దట్టంగా పెరగడంతో ఆ చెట్లపైనే ఓ మంచె ఏర్పాటు చేసేశారు గుర్తు తెలియని వ్యక్తులు. వాటిపై ఏకంగా పరుపులు వేశారు. పైకి ఎక్కడానికి నిచ్చెన పెట్టి పని కానిస్తున్నారు. దట్టమైన పొదలు ఉండటంతో, అక్కడేం జరుగుతుందో ఇన్నాళ్లూ బయటకు తెలియలేదు.

Read Also: Prabhas: మొహమాటానికి పోయి సినిమాలు చేయకు ప్రభాస్ అన్నా..?

ఒకప్పుడు రాత్రయితే చాలు ఆ మార్గం అంతా చిమ్మచీకటి.. మద్దిలపాలెం నుండి లోపలకి వచ్చే మార్గం వాహనదారులతో, పాదచారులతో రద్దీగానే ఉంటుంది. కానీ ఈ మార్గంలో మాత్రం సెక్కురిటీ అంతంత మాత్రమే.. రోడ్డుపై బండి ఆపి పక్కనే మద్యం సేవించిన అడిగే నాదుడు ఉండడడు.. ఇదే అదునుగా పక్కన పెరిగిన తుప్పలు, పొదలు మాటున వ్యభిచార కేంద్రంగా మార్చినట్టు తెలుస్తోంది. ఆ పొదల్లో ఎక్కడ చూసినా కండోమ్‌లు, సిగరెట్‌ ప్యాకెట్లు, మందు బాటిళ్లే కనిపించాయి. ఈ పొదల దగ్గర కొన్ని వేల కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. ఈ దృశ్యాలు చూస్తే చాలు అక్కడి పరిస్థితి ఏంటనేది, ఏం జరిగింది అన్నది ఈజీగా ఊహించవచ్చు. ఈ పొదల దగ్గర మద్యం బాటిళ్లతోపాటు కొన్ని సిరెంజ్‌లు దొరకడం అనేక అనుమానాలకు తావిచ్చింది. వీటన్నిటిని చూసి అవాక్కయ్యారు వర్సిటీ అధికారులు. ఈ వ్యవహారం వెనుక పెద్ద నెట్‌వర్క్‌ ఉందని అనుమానించారు.

ఇప్పటికే విశాఖలో డ్రగ్స్ కల్చర్ జోరందుకుంది. విద్యార్ధులనే లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల సరఫరా ముఠాలు రెచ్చిపోతున్నాయ్..యథేచ్చగా గంజాయి, డ్రగ్స్ ను స్టూడెంట్స్ కు చేరవేస్తు, వారిని మత్తుకు బానిసలను చేస్తున్నారు. ఇందులో భాగంగా డ్రగ్స్ ఇంజెక్షన్లను తీసుకునేందుకే వీటిని ఉపయోగించారా, లేక ఈ ప్రాంతం డ్రగ్స్‌ దందాకి అడ్డాగా మారిందా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఏజెన్సీ నుంచి విచ్చలవిడిగా వస్తున్న గంజాయి, డ్రగ్స్‌ ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారనేది అప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. ముందెన్నడు బయటపడని ఆ ప్రాంతం సడెన్ గా బయట పడే సరికి ఈ పని చేసింది ఎవరు? ఈ వ్యవహారంతో వర్శిటీలో ఎవరికైనా లింకులు ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. క్యాంపస్‌లోకి వందలాది మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి? గుట్టల కొద్దీ కండోమ్ ప్యాకెట్స్‌ దొరకడం ఏంటి? డ్రగ్స్ సిరెంజ్‌లు పడి పడిఉన్నాయంటే అసలేం జరుగుతోంది? అని స్థానికులు నివ్వెర పోయారు.

అయితే ఈ విషయంపై స్పందించిన యూనివర్సిటీ అధికారులు, వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాద్ రెడ్డి..ఈ ఘటనకు విద్యార్ధులకు ఎటువంటి సంబంధం లేదని, ఇదంతా నగరంలో ఉన్న కొంతమంది హిజ్రాలు ఇక్కడ తిష్టవేసుకుని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అనుమానం వ్యక్తం చేసారు. అయితే మెన్, ఉమెన్ హాస్టల్స్ కు కూత వేటు దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో దీని ప్రభావం విద్యార్ధులపై పడే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులకు టెన్సన్ పట్టుకుంది..ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద సెక్యూరిటి వ్యవస్థను కట్టుదిట్టం చేస్తామని, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read Also: Last Rites For Cow: గోమాతకు అంతిమ వీడ్కోలు.. ఘనంగా అంత్యక్రియలు