Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!

Dr Priyanka

Dr Priyanka

Dr Priyanka: డాక్టర్ ప్రియాంక హత్య కేసు దర్యాప్తు తీరుపై ఆమె కుటుంబ సభ్యులు మరోసారి పోలీసు అధికారులను కలిశారు. ప్రియాంక తండ్రి వెంకటేష్, సోదరుడు వరప్రసాద్.. ఆల్ ఇండియా రివర్స్ ఫెడరేషన్ నాయకులతో కలిసి రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారులతో మాట్లాడారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా, ఎలాంటి రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తావులేకుండా కొనసాగించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమ కుమార్తెను కారుతో పలుమార్లు ఢీకొట్టి హత్య చేసిన ఘటన అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులో నిందితులుగా ఉన్న వారికి కఠిన శిక్షతో పాటు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తులో సేకరించాల్సిన కొన్ని కీలక ఆధారాలపై తమకు ఉన్న అనుమానాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లిఖితపూర్వకంగా పోలీసులకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.

కేసు దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా, ఎవరిపైనా అన్యాయం లేకుండా ప్రియాంకకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అలాగే ఆదిత్య ప్రసాద్ మాల్‌పై కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిసి తమ సమస్యను వివరించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఇప్పటివరకు ఈ ఘటనపై స్పందించకపోవడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఎఫ్‌ఐఆర్‌లో నిందితులు మద్యం తాగినట్లు నమోదైందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కేసులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విచారించి, దోషులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రియాంక కుటుంబానికి ఆల్ ఇండియా రివర్స్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిందితులకు మరణశిక్ష పడే వరకు కుటుంబ సభ్యుల వెంట ఉంటామని సంఘం నాయకులు తెలిపారు. అవసరమైతే రోడ్డెక్కి ఉద్యమించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.