Site icon NTV Telugu

Devineni Uma : స్వార్థప్రయోజనాల కోసం పోలవరం తాకట్టు

పోలవరం నిర్వాసితులకు అంతా బాగుందని కేంద్రమంత్రికి జగన్ చెప్పించే ప్రయత్నం చేశారని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పునరావసం కింద ఎన్ని ఇళ్లు, ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితిలో సీఎం ఉన్నారని, దాదాపు లక్ష కుటుంబాలకు కట్టాల్సిన ఇళ్లపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పోలవరం పరిశీలనకు వస్తే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అడ్రస్ లేడని, జరిగిన పనులు చెప్పి, కావల్సినవి అడగటంలో విఫలమై సీఎం తన అసమర్థత నిరూపించుకున్నారని ఆయన విమర్శించారు. డీపీఆర్-2కు సంబంధించి రూ. 55,548 కోట్లకు ఆమోదం తెలిపితే, 28 మంది మంత్రులు ఉండి కూడా ఎందుకు ఆర్థిక అనుమతులు పొందలేకపోయారు..? అని ప్రశ్నించారు.

కేంద్ర మంత్రి పర్యటనలో రూ. 47,725 కోట్లు ఇస్తే చాలని రాజీపడటంలో పిరికితనం ఏంటని, స్వార్థప్రయోజనాల కోసం ఎందుకు పోలవరం తాకట్టు పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. సీబీఐ, ఈడీ, బాబాయి హత్య కేసుల్ని నుంచి తప్పించుకునేందుకే జగన్ రాజీపడి కేంద్రం ముందు నోరెత్తలేదని, పోలవరం ప్రాజెక్టుపై సీఎం ఏం మాట్లాడతారు, కేంద్రమంత్రి ఏం చెప్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తుంటే మంత్రుల కార్ పార్కింగ్ గొడవకి పరిమితమయ్యారని ఆరోపించారు. నిర్వాసితులకు ద్రోహంచేసే హక్కు ఈ సీఎంకు ఎవరిచ్చారు..? బంగారంలాంటి డ్యామును ఎత్తిపోతల పథకంగా మార్చి తన తండ్రి విగ్రహం పెట్టుకునేందుకు సీఎం తప్పుడు పనులు చేస్తున్నారని విమర్శించారు.

https://ntvtelugu.com/harish-rao-started-telangana-health-profile/
Exit mobile version