NTV Telugu Site icon

Devineni Uma: ఢిల్లీ వెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న జగన్.. పోలవరం డబ్బులు తెచ్చుకోలేరా?

Devineni Uma

Devineni Uma

Telugu Desam Party Leader Devineni Uma: పోలవరం ప్రాజెక్టు విషయంలో తమపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం కాఫర్‌ డ్యాం ఎత్తు పెంచడానికి ఎవరి అనుమతి తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. కాఫర్‌ డ్యాం ఎత్తు పెంచడానికి పీపీఏ అనుమతిచ్చిందా లేదా సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌ ఇచ్చిందా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం జగన్ చెప్పారంటూ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు పెంచేస్తామని మంత్రి అంబటి రాంబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు పెంచడానికి అనుమతిలిచ్చారా? లేదా అనే అంశంపై ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదని దేవినేని ఉమ సూటి ప్రశ్న వేశారు. పోలవరం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డి పెట్టి వెళ్లారని.. రాంబాబుకేం తెలియదు.. తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

Read Also: Andhra Pradesh Politics : నో కాంప్రమైజ్ అంటున్న విశాఖ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం డ్యామ్‌కు సంబంధించి ఎంత పని చేశారో చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను చూపించి.. తామే కట్టామని కేంద్రానికి చూపించుకున్నారని చురకలు అంటించారు. టీడీపీ హయాంలో చేసిన పోలవరం పనులకు సంబంధించి రూ. 4 వేల కోట్ల నిధులు తెచ్చుకుని.. లిక్కర్‌ కాంట్రాక్టర్లకు అడ్వాన్సులిచ్చారని దేవినేని ఉమ ఆరోపించారు. నిర్వాసితులకు డబ్బులు ఇచ్చారా అని నిలదీశారు. ఢిల్లీ వెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న సీఎం జగన్‌.. పోలవరం నిధులు తెచ్చుకోలేరా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. తాము వాస్తవాలు మాట్లాడితే పొడుచుకు వచ్చిందా అని నిలదీశారు. చంద్రబాబు మీద.. దేవినేని ఉమ మీద పడి ఏడ్వడం దేనికంటూ మండిపడ్డారు. పోలవరం గురించి తనను అడగొద్దంటూ ఓ మాజీ మంత్రి అంటే.. ఇప్పుడు వచ్చిన మంత్రి రాంబాబు తెగ ఆక్రోశపడిపోతున్నాడని కౌంటర్ ఇచ్చారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులను వైఎస్‌ హయాంలో ఎందుకు ప్రీ-క్లోజర్‌ చేశారో చెప్పాలన్నారు.

వైఎస్‌ పార్ధివ శరీరం దగ్గరే జగన్‌ పోలవరం ప్రాజెక్టులో కమిషన్ల కోసం కాంట్రాక్టర్లతో మీటింగ్‌ పెట్టారని దేవినేని ఉమ విమర్శలు చేశారు. వైఎస్‌ ప్రభుత్వం చేసిన పోలవరం పాపాన్ని కడిగి నిర్మాణం మొదలు పెట్టింది టీడీపీనే అన్నారు. తాడేపల్లిలో హెలికాప్టర్‌ ఎందుకు.. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలకు పంపివచ్చుగా అని సూచించారు. పోలవరంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని.. పేపర్‌ లేకుండానే పోలవరంపై చర్చకు వస్తానని దేవినేని ఉమ స్పష్టం చేశారు. పోలవరం డ్యాంపై పెడతారో లేదా తాడేపల్లి ప్యాలెస్‌ గేట్‌ ముందు చర్చ పెట్టినా తాను వస్తానన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామంటూ రకరకాల డెడ్‌ లైన్లు పెట్టింది వైసీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రాంబాబు సొల్లు కబుర్లు చెప్పొద్దని.. చించుకుని మాట్లాడొద్దని హితవు పలికారు. చించుకుని మాట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకోవద్దన్నారు. రాంబాబు సబ్జెక్ట్‌ నేర్చుకో.. బుర్ర పెట్టు అని దేవినేని ఉమ చురకలు అంటించారు.