ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత నేత దేవినేని చందు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక రోజుకో సమస్య సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు ఉన్నంత కాలం విద్యుత్ చార్జీ పెంచలేదని, స్లాబ్ రేట్ 1.90 పైసలు పెంచి ప్రజలపై అదనపు భారం వేశారన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచడంతో ప్రజల నుంచి వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆయన మండిపడ్డారు.
ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకు హడావిడిగా కొత్త జిల్లాల విభజన చేపట్టింది ప్రభుత్వమని ఆయన విమర్శించారు. 30 యూనిట్లు వాడితే చాలు ప్రజల పై విద్యుత్ భారం పడుతుందని ఆయన అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకూ ప్రజల పక్షాన ఉండి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. చెత్త మీద కూడా పన్ను వేసింది, ఈ చెత్త ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే చెత్త, ఆస్తి పన్ను వేసి ప్రజలపై భారం మోపిన ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పేరుతో నిరుపేదలపై భారం వేస్తుందని ఆయన అన్నారు.
