Marriages Season: తెలుగు రాష్ట్రాలలో పెళ్లి సందడి ప్రారంభమైంది. మూఢాల కారణంగా మూడు నెలలుగా శుభకార్యాలకు చెక్ పడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి 21 వరకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. దీంతో 20 రోజుల పాటు పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే లక్ష పెళ్లిళ్లు జరగనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో మొత్తం కలుపుకుంటే దాదాపు 5 లక్షల పెళ్లిళ్లు జరగనున్నట్లు సమాచారం అందుతోంది. అందులోనూ విదేశీ ప్రయాణాలపై కరోనా ఆంక్షలు తొలగడం, డిసెంబరులో ఎన్నారైలకు ఎక్కువగా సెలవులు రావడంతో పెళ్లిళ్లు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ మేరకు పురోహితులు, షామియానా సప్లయర్స్, వంట మనుషులు, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
Read Also: Krithi Sanon: ప్యార్ లేదు, పీఆర్ కాదు… అతను ఓవర్ చేశాడు
మరోవైపు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా కళ్యాణమండపాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి నగరాల్లో పెళ్లి వేడుకల కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు రంగంలోకి దిగాయి. సాధారణంగా కార్తీకమాసం మార్గశిర మాసంలో ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతాయి. కానీ మూఢాల కారణంగా మాఘమాసంలో పెళ్లిళ్లు జరుపుతున్నారు. మళ్లీ ఫిబ్రవరి వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఇప్పుడే పెళ్లిళ్లు జరపాలని నిర్ణయించారు. ఏప్రిల్‌లో ఉగాది తర్వాత చైత్రమాసంలో మళ్లీ మూఢం వస్తోంది. మే నెల వరకు శుభ ముహూర్తాలు ఉండవు. దీంతో డిసెంబరులో అందుబాటులో ఉన్న కొన్ని ముహూర్తాల్లోనే ఎక్కువ మంది పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వేద పండితులు చెబుతున్నారు.