Site icon NTV Telugu

Annamayya District: లేడీ కిల్లర్.. కోడలి తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన అత్త

Rayachoti Killing Scene

Rayachoti Killing Scene

Annamayya District: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని రాయచోటి మండలం కొత్తపేట రామాపురంలో ఓ అత్త అతి క్రూరంగా ప్రవర్తించింది. కోడలి తల నరికి.. ఆ తలను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులకు లొంగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. కె.రామాపురంలో అత్త సుబ్బమ్మ, కోడలు వసుంధరకు కొంతకాలంగా పడటం లేదు. తరచూ కుటుంబంలో ఇద్దరికీ విభేదాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు మరోసారి అత్తాకోడళ్ల మధ్య వార్ చోటు చేసుకుంది. దీంతో అత్త సుబ్బమ్మ ఆగ్రహంతో ఊగిపోయింది. కోడలు వసుంధరపై దాడికి దిగింది. కోడలు తన మాట వినకపోవడంతో కత్తి తీసుకుని ఏకంగా ఆమె తల నరికేసింది. ఈ ఘటనలో వసుంధర తల, దేహం రెండు ముక్కలయ్యాయి. అయినా అత్తలో కోపం చల్లారలేదు.

కాసేపటి తర్వాత కోడలి తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తానే తన కోడలిని హత్య చేసినట్లు అంగీకరించి పోలీసుల ముందు లొంగిపోయింది. కోడలి తలను నల్లటి కవర్‌లో పెట్టుకుని సుబ్బమ్మ రోడ్డుపై నడుచుకుని వెళ్తుంటే చూసిన వాళ్లంతా భయభ్రాంతులకు గురయ్యారు. సుబ్బమ్మను చూసి భయంతో వణికిపోయారు. కనీసం ఆమెతో మాట్లాడేందుకు కూడా ఎవరూ ధైర్యం చూపించలేదు. అటు పోలీస్ స్టేషన్‌లో వసుంధర తలను చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఈ కేసులో అత్త సుబ్బమ్మ స్వయంగా లొంగిపోవడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా రాయచోటి మండల చరిత్రలో ఇలాంటి క్రూరమైన ఘటన జరగడం ఇదే తొలిసారి అంటూ స్థానికులు మాట్లాడుకుంటున్నారు.

 

Exit mobile version