Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 5వరకు వేడుకలు కొనసాగుతాయి. కరోనా కారణంగా గత రెండేళ్లు పరిమిత భక్తుల మధ్య వేడుకలు జరిగాయి. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అమలులో లేనందున పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు కనీసం 14 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా ఇంద్రకీలాద్రి కొండ దిగువన, పైభాగంలో ఏర్పాట్లు చేశారు. కొండ దిగువన వినాయక ఆలయం నుంచి మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్ ఏర్పాటు చేయించారు. ఉత్సవాల వేళ ప్రతిరోజూ తెల్లవారుజామున 4గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
Read Also: LIVE : సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్ర పారాయణం చేస్తే..?
కాగా తొలిరోజు సోమవారం నాడు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గా దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం శుభదాయకమని, సకల దరిద్రాలు పోయి ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం. అటు దసరా ఉత్సవాల సందర్భంగా 10 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ప్రత్యేక లక్ష కుంకుమార్చన పూజలకు రూ.3వేలు ధర నిర్ణయించారు. మూలా నక్షత్రం రోజున మాత్రం ధర రూ.5వేలుగా పెట్టారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పూజలు నిర్వహిస్తారు.
భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఇంద్రకీలాద్రి ఆలయ ఈవో భ్రమరాంబ వెల్లడించారు. పది రోజుల పాటు భక్తులకు ప్యాకెట్స్ రూపంలో అన్నప్రసాదం అందజేస్తామన్నారు. పది రోజుల పాటు పది అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తారని.. 200 మంది ఆలయ సిబ్బందితో పాటు పోలీస్, మున్సిపల్ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహిస్తారని.. తొలి రోజు అమ్మవారి దర్శనం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు.