ఏపీలో తూర్పుగోదావరి రాజకీయాలు గోదావరి అంత ప్రశాంతంగా వుండవు. తుఫాన్ వచ్చినప్పుడు లంక గ్రామాల్ని ముంచేసినట్టుగా అక్కడ రాజకీయాలు హాట్ హాట్ గా వుంటాయి. తాజాగా జనసేన-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంగళగిరిలో జరిగిన జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి దాడిశెట్టి రాజా కౌంటరేశారు. అంబేద్కర్ జిల్లా ప్రకటించినందుకు పవన్, చంద్రబాబు అల్లర్లు సృష్టించారన్నారు. మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టి చంద్రబాబు, పవన్ ఆ మంటల్లో చలికాసుకున్నారు. కోనసీమ అల్లర్లలో జనసేన, టీడీపీ సానుభూతి పరులే అరెస్ట్ అయ్యారన్నారు దాడిశెట్టి రాజా.
మా ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం, పవన్ రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారు..రాష్ట్రమంతా అధోగతి పాలైపోవాలని చంద్రబాబు, పవన్ చూస్తున్నారు. పవన్ అభిమానులంతా పవన్ ముఖ్యమంత్రి అవ్వాలని అంటుంటే పవన్ మాత్రం చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాడు. రానున్న రోజుల్లో చంద్రబాబుకి బాయ్ బాయ్ చెప్పి, పవన్ కి ప్యాకప్ చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు మంత్రి రాజా.
