బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి పెను ముప్పులా మారుతోంది. ఇది రాబోయే సమయంలో ‘అర్నాబ్’ అతి తీవ్ర తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ హైఅలర్ట్ ప్రకటించారు. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా ప్రకారం, ఈ తుఫాన్ కాకినాడ – నర్సాపురం మధ్య కోనసీమ ప్రాంతం గుండా తీరం దాటేందుకు వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి.
గంటకు 140 కి.మీ వేగంతో ప్రచండ గాలులు.. కుంభవర్షాలు
తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు దాదాపు 140 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రచండ గాలులు విరుచుకుపడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ఈ తుఫాన్ తీవ్రత కారణంగా కోస్తాంధ్ర వ్యాప్తంగా కుంభవర్షాలు కురిసే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) ముప్పు కూడా పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
జిల్లాల వారీగా హైఅలర్ట్.. రెడ్, ఆరెంజ్ జోన్లు
వాతావరణ పరిస్థితుల తీవ్రతను బట్టి అధికారులు జిల్లాలను అప్రమత్తం చేశారు. ఈనెల 27న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా తుఫాన్ తీరం దాటే కీలక సమయంలో అనకాపల్లి, విశాఖపట్నం , ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు ‘రెడ్ అలెర్ట్’ కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు ఉత్తరాంధ్రలోని మిగిలిన ప్రాంతాలు , దక్షిణ కోస్తా జిల్లాలను ‘ఆరెంజ్ అలెర్ట్’ జోన్ పరిధిలో ఉంచారు. పెను తుఫాన్ ముప్పు మునుముందుకు వస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలకు సిద్ధమైంది. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లరాదని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, అధికారిక సూచనలను విధిగా పాటించాలని యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

