మండు వేసవిలో ఏపీకి తుఫాన్ అలర్ట్ పొంచి ఉంది. ఏపీలో ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా… మరోవైపు అకాల వర్షాలు ప్రజలకు ఉపశమనం కలిగించడంతో పాటు ఆర్థికంగా నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 8 నాటికి ఈ వాయుగుండం తుఫాన్‌గా రూపు సంతరించుకుంటుందని… ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల మధ్య ఈ తుఫాన్ కేంద్రీకృతం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
తుఫాన్ ఏర్పడనున్న నేపథ్యంలో ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్నిచోట్ల వర్షాలు పడుతుండగా.. వచ్చే 24 గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రాయలసీమలోనూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. సముద్రంలో పరిస్థితుల దృష్ట్యా మత్య్సకారులు వెటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. గడిచిన 48 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో గాలివానల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా పిడుగులతో ప్రజలు హడలిపోతున్నారు.