ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు సీఎస్ సమీర్ శర్మ. సీఎస్ తో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. గత కొంతకాలంగా పెండింగ్‌లో వున్న ఆర్థికేతర అంశాలను తక్షణం పరిష్కరిస్తామని గతంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో జరిగిన భేటీలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఉద్యోగుల అర్ధికేతర సమస్యల పరిష్కారంపై ఇప్పటికే దృష్టి సారించింది ప్రభుత్వం.
ఆర్దిక సమస్యలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో చర్చ జరుగుతోంది. 11వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల విడుదల, సిపిఎస్ రద్దు, హెల్త్ కార్డులు వంటి అంశాలపై చర్చిస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపు వంటి డిమాండ్ల పై చర్చ సాగుతోంది.
ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షనర్లు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. తమకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఏ మేరకు ఉన్నాయో ప్రకటించాలని స్పష్టం చేస్తున్నారు ఉద్యోగులు. 11వ పీఆర్సీ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. ప్రభుత్వం వీటిని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
